ఈ లక్షణాలు షుగర్​ వ్యాధికి సంకేతాలు కావొచ్చు... జాగ్రత్త!

  • మారిన జీవన శైలితో చాలా మందిలో మధుమేహం సమస్య
  • మొదట్లో దీనిని గుర్తించలేక తీవ్ర అనారోగ్యాల బారినపడుతున్న ప్రజలు
  • కొన్ని లక్షణాలను గుర్తించి జాగ్రత్త పడాలని సూచిస్తున్న నిపుణులు
మారిన ఆహార అలవాట్లు, సరిగా నిద్ర లేకపోవడం, శరీరానికి వ్యాయామం లేకపోవడంతో చాలా మంది షుగర్ (మధుమేహం) బారిన పడుతున్నారు. ఇది సైలెంట్ కిల్లర్. పైకి కనబడకుండానే శరీరాన్ని గుల్ల చేసే మహమ్మారి. మధుమేహం ఉన్నవారికి తరచూ మూత్రం రావడం, ఎప్పుడూ దాహంగా అనిపిస్తుండటం వంటి కొన్ని లక్షణాలు ఉంటాయన్న విషయం చాలా మందికి తెలుసు. కానీ మధుమేహానికి మరికొన్ని లక్షణాలు కూడా ఉంటాయని... వాటిని గమనిస్తే, ముందే జాగ్రత్త పడవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

చర్మంలో మార్పులు
మధుమేహం బారినపడిన వారి చర్మంలో మార్పులు వస్తాయి. చర్మంపై నల్లటి ప్యాచ్ లు ఏర్పడతాయి. ముఖ్యంగా చర్మం ముడత పడే భాగాలైన మెడ వెనుక, బాహుమూలాలు, జననేంద్రియాల వంటి చోట చర్మం నల్లగా, మందంగా, గరుకుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

తరచూ ఇన్ఫెక్షన్లు సోకుతుండటం
రక్తంలో అధికంగా చక్కెర స్థాయులు ఉంటే... శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. దీనితో మధుమేహం బారినపడినవారు తరచూ ఇన్ఫెక్షన్లకు లోనవుతుంటారు. ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, స్కిన్ ఇన్ఫెక్షన్లు వంటివి తరచూ వస్తుంటాయి. జలుబు కూడా త్వరగా వస్తుందని వివరిస్తున్నారు. ఈ లక్షణాలు తరచూ కనిపిస్తుంటే... వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

చిగుళ్ల నుంచి రక్తం కారడం...
దంతాలు, చిగుళ్ల మధ్య సందు పెరగడం, చిగుళ్ల నుంచి తరచూ రక్తం కారడం, నోటి దుర్వాసన వంటివి ‘పెరియోడాంటైటిస్’ అనే వ్యాధి లక్షణాలు. మధుమేహం ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

కంటి చూపులో మార్పులు...
రక్తంలో షుగర్ స్థాయులు తరచూ హెచ్చుతగ్గులకు గురవుతుండటం వల్ల కంటి చూపులో మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దృశ్యం మసకగా కనిపించడం, సరిగా ఫోకస్ చేయలేకపోవడం వంటివి అకస్మాత్తుగా మొదలవుతాయని సూచిస్తున్నారు. ఇలాంటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని... తగిన పరీక్షలు చేయించుకుని, మందులు వాడాలని స్పష్టం చేస్తున్నారు.

వినికిడిలో మార్పులు...
మధుమేహం, అధిక రక్తపోటు కారణంగా చెవి అంతర్భాగంలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఉన్నట్టుండి వినికిడికి సంబంధించిన మార్పులు తలెత్తుతాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ధ్వనులు సరిగా వినపడవని చెబుతున్నారు. మధుమేహానికి సంబంధించిన ఇతర లక్షణాలు కూడా ఉంటే... ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

మానసిక స్థితిలో మార్పులు...
మధుమేహం కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా సమస్యలను తెస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ స్థాయులు తరచూ మారిపోతుండటం వల్ల... ఉన్నట్టుండి మూడ్ మారిపోతుండటం (మూడ్ స్వింగ్), చిరాకు, కోపం, దేనిపైనా సరిగా దృష్టిపెట్టలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు. 

తరచూ తిమ్మిర్లు రావడం...
చూడటానికి చిన్న సమస్యే అయినా తరచూ కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు రావడం, సూదులతో గుచ్చుతున్నట్టుగా ఇబ్బంది అనిపించడం కూడా మధుమేహం లక్షణాలేనని నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయం మాత్రం మరవొద్దు
పైన చెప్పినవన్నీ మధుమేహం లక్షణాలే అయినా... మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు, వ్యాధుల కారణంగా కూడా తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ఈ లక్షణాలు కనిపించగానే మధుమేహం అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. అలాగని ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని, వైద్య పరీక్షలు చేయించుకుని సమస్యను గుర్తించాలని, మందులు వాడాలని స్పష్టం చేస్తున్నారు.


More Telugu News