స్టెల్లా నౌకలో 1,320 టన్నుల రేషన్ బియ్యం

  • మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్
  • నౌక నుంచి రేషన్ బియ్యం కిందకు దించడానికి 24 నుంచి 48 గంటలు పడుతుందన్న కలెక్టర్  
  • నౌకను ఎప్పుడు విడుదల చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి   
కాకినాడ యాంకరేజి పోర్టులోని స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఉన్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేస్తామని, ఆ బియ్యాన్ని నౌక నుంచి అన్ లోడింగ్ చేయడానికి 24 గంటల నుంచి 48 గంటలు పడుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్‌లో ఆయన ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ రాహుల్ మీనాతో కలిసి మీడియాతో మాట్లాడారు. 

స్టెల్లా ఎల్ పనామా నౌకలో మొత్తం 1,320 టన్నుల రేషన్ బియ్యం గుర్తించామని చెప్పారు. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ద్వారా పశ్చిమాఫ్రికాకు ఎగుమతి చేయడానికి ఈ అక్రమ నిల్వలను సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. నౌకు తనిఖీ చేసిన రోజు సాయంత్రం బార్జిలో గుర్తించిన 1,064 టన్నులూ రేషన్ బియ్యమేనని తెలిందన్నారు. ఇందులో వెయ్యి టన్నులు లవణ్ ఇంటర్నేషనల్‌వి, 64 టన్నులు సాయి తేజ అగ్రోస్ సంస్థ బుక్ చేసినట్లుగా గుర్తించామని తెలిపారు. 

ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యంను తనిఖీ చేసిన విషయం తెలిసిందే. నాడు పవన్ కల్యాణ్ సీజ్డ్ షిప్ అంటూ అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. అయితే, నౌకను సీజ్ చేసే అవకాశాలు లేకపోవడంతో రేషన్ బియ్యాన్ని నౌక నుంచి కిందకు దించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. 

ఈ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి సేకరించారు ? వారికి నిల్వలు అందించిన మిల్లర్లు, వ్యాపారులు ఎవరు ? అనే కోణంలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నౌక నుంచి రేషన్ బియ్యం దింపడానికి 24 నుంచి 48 గంటలు పడుతుందని, తర్వాత నౌకను ఎప్పుడు విడుదల చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తున్న ఆరు మిల్లులను సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. రేషన్ మాఫియా కట్టడిలో భాగంగా పోర్టులపై నిఘా ఉంచామని, స్మగ్లింగ్ కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని ఆయన తెలిపారు.  


More Telugu News