నేను ఇంతకాలం సినిమాలు చేయడానికి కారణం ఇదే: రాజేంద్రప్రసాద్

  • చిన్నప్పటి నుంచి అల్లరివాడినేనన్న రాజేంద్రప్రసాద్
  • తనని హీరోను చేసిన వంశీనే కారణం అని వెల్లడి 
  • 'లేడీస్ టైలర్' తరువాత వెనుదిరిగి చూడలేదని వ్యాఖ్య 
  • అభిమానుల ఆదరణ లభించడమే అదృష్టమంటూ హర్షం  

తెలుగు తెరపైకి రాకెట్ లా దూసుకొచ్చిన హాస్య కథానాయకుడు రాజేంద్రప్రసాద్. తనదైన మార్క్ ను పరిచయం చేస్తూ, కామెడీని పరుగులు తీయించినవారాయన. అలాంటి రాజేంద్రప్రసాద్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 

"చిన్నప్పటి నుంచి నేను అల్లరివాడినే. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం చేయకుండా కొంతకాలం తిరిగాను. ఆ తరువాత నేను ఏం చేయాలనేది నాకు అర్థమైంది. 'ప్రేమించు పెళ్లాడు' సినిమాతో వంశీ నన్ను హీరోను చేశాడు. ఆ తరువాత 'లేడీస్ టైలర్'తో హిట్ ఇచ్చాడు. ఆ సినిమా నుంచి నేను వెనుతిరిగి చూసుకోలేదు. ఏడాదికి 12 సినిమాలు చేస్తూ వెళ్లాను. అది భగవంతుడు ఇచ్చిన అవకాశంగానే నేను భావిస్తూ ఉంటాను" అని అన్నారు.

" ఆనాటి నిర్మాతలు .. దర్శకులు .. రచయితలు నా కోసం విభిన్నమైన పాత్రలను సృష్టించారు. అవి రెగ్యులర్ హీరోల పాత్రలు కాదు. సమాజంలో మన చుట్టూ కనిపించే పాత్రలనే తెరపై నేను చేశాను. 'అప్పుల అప్పారావు' .. 'పేకాట పాపారావు' అలాంటివే. తమ చుట్టూ కనిపించే పాత్రల మాదిరిగా ఉండటం వలన, ఆ పాత్రలు అందరికీ కనెక్ట్ అయ్యాయి. చిన్న బడ్జెట్ లు ... పెద్ద హిట్లు అన్నట్టుగా నా కెరియర్ కొనసాగింది. ప్రేక్షకులు తమ ఇంట్లో ఒకరిగా నన్ను భావించడం వల్లనే, ఇంతకాలం పాటు నేను సినిమాలు చేయగలిగాను" అని చెప్పారు.



More Telugu News