అశ్విన్ రిటైర్మెంట్ వెనుక పలు కారణాలు: రోహిత్ శర్మ

  • అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తామన్న రోహిత్ శర్మ
  • అవకాశం రాని సమయంలో వీడ్కోలు పలికితే బాగుంటుందని భావించి ఉండవచ్చునని వ్యాఖ్య
  • అండర్ 17 స్థాయి నుంచి తనకు తెలుసునన్న రోహిత్ శర్మ
అశ్విన్ రిటైర్మెంట్ వెనుక పలు కారణాలు ఉన్నాయని, అది అతని వ్యక్తిగత నిర్ణయమని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. రిటైర్మెంట్‌పై అన్ని ప్రశ్నలకూ అశ్విన్ సమాధానం ఇస్తాడన్నారు. తనకు అవకాశం రాని సమయంలోనే వీడ్కోలు పలికితే బాగుంటుందని అశ్విన్ భావించి ఉండవచ్చునన్నారు. 

గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసిన అనంతరం రోహిత్ శర్మతో కలిసి అశ్విన్ విలేకరుల సమావేశానికి వచ్చారు. ఆ సమయంలోనే అశ్విన్ రిటైర్మెంట్‌ను ప్రకటించారు. ఈ క్రమంలో అశ్విన్ రిటైర్మెంట్ అంశంపై రోహిత్ శర్మ స్పందించారు. ఆస్ట్రేలియా టూర్‌కు చేరుకున్న తర్వాత అశ్విన్ రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకున్నాడన్నారు. ఈ నెల 19న భారత్‌కు వెళతాడన్నారు.

అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని పెర్త్ టెస్ట్ తర్వాత అతనిని కలిసిన సమయంలో తెలుసుకున్నట్లు రోహిత్ శర్మ చెప్పారు. జట్టు ప్రణాళిక, కలయికను అర్థం చేసుకున్నాడని.. అందుకే బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించాడన్నారు. తొలి టెస్ట్‌ సమయంలో రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని చెప్పాడని, కానీ పింక్ బాల్‌ టెస్ట్‌ వరకైనా కొనసాగాలని ఒప్పించామన్నారు. 

అశ్విన్‌తో కలిసి తాను చాలా క్రికెట్ ఆడానని రోహిత్ శర్మ తెలిపారు. అండర్-17 స్థాయి నుంచి అశ్విన్‌ తనకు తెలుసని చెప్పారు. తొలుత ఓపెనర్‌గా వచ్చేవాడని... ఆ తర్వాత చాలా రోజులు కనిపించకుండా పోయాడన్నారు. ఆ తర్వాత తమిళనాడు తరఫున ఓ బౌలర్‌ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడని విన్నానని.. అది ఎవరా? అని ఆరా తీస్తే అశ్వినేనని తెలిసిందని గుర్తు చేసుకున్నారు.

బ్యాటర్‌గా కెరీర్‌ను ప్రారంభించి... బౌలర్‌ అవతారం ఎత్తడం ఆశ్చర్యంగా అనిపించిందన్నారు. సుదీర్ఘకాలం పాటు ఇద్దరం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగామని, ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయన్నారు. జట్లు విజయాల్లో అనేకసార్లు అశ్విన్ కీలకపాత్ర పోషించాడన్నారు.


More Telugu News