ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆస్తి విలువ ఎంతో తెలుసా..?

  • అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ర‌విచంద్ర‌న్ అశ్విన్ రిటైర్మెంట్
  • షాకింగ్ నిర్ణ‌యంతో అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసిన దిగ్గ‌జ స్పిన్న‌ర్
  • 2024 నాటికి అశ్విన్ ఆస్తి విలువ దాదాపు రూ. 132 కోట్లు
  • ఐపీఎల్ నుంచి అశ్విన్ ఆదాయం రూ. 97.5 కోట్లు
  • అశ్విన్‌కు విలాసవంతమైన ఇల్లు, కార్లు
భార‌త దిగ్గ‌జ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ బీజీటీ సిరీస్ మ‌ధ్య‌లో అశ్విన్ ఇలా షాకింగ్ నిర్ణ‌యం తీసుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. 14 ఏళ్ల‌కు పైగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ ఆడిన స్టార్ స్నిన్న‌ర్ ఇక‌పై ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్ర‌మే క‌నిపించ‌నున్నాడు. వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నాడు. 

సుదీర్ఘ అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన అశ్విన్ ఆస్తి విలువ ఎంత ఉంటుంద‌నేది స‌గ‌టు క్రికెట్ అభిమాని మ‌దిలో మెదిలే ప్ర‌శ్న‌. అయితే, మీడియా నివేదికలు, బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 2024 నాటికి రవిచంద్రన్ అశ్విన్ ఆస్తి విలువ దాదాపు రూ. 132 కోట్లు ఉంటుంద‌ని అంచనా. ఇక అతని ప్రాథమిక ఆదాయ వనరులు అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు మొదలైనవి.    

అశ్విన్‌కు మ్యాచ్ ఫీజు, బీసీసీతో సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా వ‌చ్చే ఆదాయం
రవిచంద్రన్ అశ్విన్ 2024 ఏడాదికి గాను బీసీసీఐ నుంచి గ్రేడ్-ఏ కాంట్రాక్ట్‌ను క‌లిగి ఉన్నాడు. అంటే భారత క్రికెట్ బోర్డు నుంచి ఏటా అత‌ను రూ. 5 కోట్ల జీతం పొందుతున్నాడు. 

అలాగే అతని వార్షిక జీతం కాకుండా ఆడిన ప్రతి గేమ్‌కు మ్యాచ్ ఫీజు కూడా పొందాడు. అలాగే రిటైర్మెంట్‌కు ముందు అతని మ్యాచ్ ఫీజు టెస్టుకు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షలు. 

ఐపీఎల్ నుంచి అశ్విన్ ఆదాయం రూ. 97.5 కోట్లు
2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేశాడు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అశ్విన్ ఐపీఎల్ ద్వారా మొత్తం రూ. 97.5 కోట్లు సంపాదించాడు. ఇక ఇటీవ‌ల జ‌రిగిన‌ ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9.75 కోట్లకు అశ్విన్‌ను కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే.

త‌న ఐపీఎల్ కెరీర్‌లో అశ్విన్ సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 

ర‌విచంద్ర‌న్‌ అశ్విన్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్
ఇక ప‌లు బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న‌ రవిచంద్రన్ అశ్విన్ ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి దాదాపు రూ. 4.5- 5 కోట్లు వసూలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అత‌ని చేతిలో మింత్రా, ఒప్పో, కోకా-కోలా లాంటి ప‌లు బ్రాండ్ల ఎండార్స్‌మెంట్స్ ఉన్నాయి. 

అశ్విన్ కు విలాసవంతమైన ఇల్లు, కార్లు
అశ్విన్ బిజినెస్ వెంచర్ విషయానికి వస్తే అతను క్యారమ్ బాల్స్ అనే మీడియా కంపెనీని కలిగి ఉన్నాడు. ఈ కంపెనీ బ్రాండ్ ప్రమోషన్లు, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వంటివి చేస్తుంది. ఇక అత‌నికి చెన్నైలో విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని విలువ దాదాపు రూ.9 కోట్లు ఉంటుంద‌ని అంచనా. అలాగే అశ్విన్‌కు ఆడి క్యూ7, రోల్స్ రాయిస్ వంటి ల‌గ్జ‌రీ కార్లు కూడా ఉన్నాయి.  

ఆర్. అశ్విన్ యూట్యూబ్ ఛానెళ్లు 
రవిచంద్రన్ అశ్విన్‌కి రెండు యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి. అందులో ఒక‌టి 'అశ్విన్' అనే ఛానెల్‌. ఇందులో అత‌ను తన మాతృభాష తమిళంలో క్రికెట్ గురించి మాట్లాడతాడు. రెండో యూట్యూబ్ ఛానెల్ పేరు 'ఆష్ కీ బాత్'. ఇక్కడ అతను హిందీలో క్రికెట్‌పై త‌న అభిప్రాయాల‌ను పంచుకుంటాడు. ఈ రెండింటి ద్వారా కూడా కొంత మొత్తం ఆదాయం వ‌స్తుంది.  




More Telugu News