తల్లిదండ్రులకు లేఖ రాసి హాస్టల్ నుంచి అదృశ్యమైన నెల్లూరు బాలుడు

  • తనకంటే చెల్లినే బాగా చూసుకుంటున్నారని ఆరోపణ
  • రెండేళ్లలో తిరిగి వస్తానంటూ లేఖలో పేర్కొన్న వైనం
  • పోలీసులను ఆశ్రయించిన బాలుడి తల్లిదండ్రులు
‘మీకు నాకన్నా చెల్లి అంటేనే ఎక్కువిష్టం.. చెల్లినే బాగా చూసుకుంటున్నారు. నన్ను పట్టించుకోవడంలేదు’ అంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి ఓ బాలుడు హాస్టల్ నుంచి అదృశ్యమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కావలికి చెందిన దంపతులు తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడిని దేవరపాలెం గురుకుల పాఠశాల హాస్టల్ లో చేర్పించారు. కూతురును దగ్గర్లోని స్కూలుకు పంపిస్తున్నారు. అమ్మానాన్నలకు చెల్లి అంటేనే ఎక్కువ ఇష్టమని, చెల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని బాలుడు కొంతకాలం నుంచి మనస్తాపం చెందుతున్నాడు. తనను హాస్టల్ కు పంపించడంపై అసంతృప్తికి లోనయ్యాడు.

ఈ క్రమంలోనే తల్లిదండ్రులకు లేఖ రాసి మంగళవారం సాయంత్రం హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. ‘నాకంటే మీరు చెల్లినే బాగా చూసుకుంటున్నారు. నన్ను సరిగా చూసుకోవడంలేదు. చెల్లి అంటేనే మీకు ఇష్టం. అందుకే నేను వెళ్లిపోతున్నా. టెన్షన్ పడకండి. రెండేళ్లలో తిరిగి వస్తా. ఇంట్లో ఉన్న ట్యాబ్ స్కూలుకు అప్పగించండి’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. కాగా, బాలుడు కనిపించకుండా పోవడంతో హాస్టల్ నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకు రాసిన లేఖను చూసి తల్లిదండ్రులు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నెల్లూరు గ్రామీణ పోలీసులు.. బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


More Telugu News