మాకు ఓట్లు వేయని వాళ్ల కోసం కూడా పనిచేస్తాం: పవన్ కల్యాణ్

  • అల్లూరి జిల్లాలో పవన్ పర్యటన
  • బల్లగరువులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • ఓట్ల కోసం తాము పనిచేయడంలేదని స్పష్టీకరణ 
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు తాను ప్రజలకు ఏదైనా చేయగలుగుతున్నాను అంటే అందుకు కారణం ప్రజలు ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడమేనని అన్నారు. అధికారంలో ఉండడం వల్లే ప్రజలకు మేలు చేయగలుగుతున్నానని వివరించారు. ఒకటి కాదు, రెండు కాదు... 164 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ స్థానాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. 

"ఇందాక పాత్రికేయ సోదరులు అడుగుతున్నారు.... ఈ పార్లమెంటు స్థానం మీ కూటమికి దక్కలేదు కదా అన్నారు. వాళ్లకి నేను ఒకటే చెప్పాను... మాకు ఓట్లు వేయని ప్రజల కోసం కూడా మేం పనిచేస్తాం... మేం ఓట్ల కోసం ఇలా చేయడం లేదు... ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.105 కోట్లు ఖర్చు పెడితే లబ్ధి పొందేది 4,500 మంది గిరిజనులు మాత్రమే... పైగా వాళ్లు మాకు ఓట్లు కూడా వేయలేదు... అభివృద్ధే మాకు ముఖ్యం అని చెప్పడానికి ఇదే నిదర్శనం" అని స్పష్టం చేశారు.


More Telugu News