ఇవాళ ఒకరు తప్పుడు సమాచారంతో మాట్లాడుతుంటే బాధ కలిగింది: అల్లు అరవింద్

  • సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్
  • సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బదులిచ్చే ప్రయత్నం
  • అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లాడిన వైనం
  • తన బిడ్డ చేయని తప్పుకు కుమిలిపోతున్నాడంటూ ఆవేదన
తన కుమారుడు అల్లు అర్జున్ కు ఎదురైన పరిస్థితి పట్ల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పుష్ప-2 సినిమా భారతీయ సినీ చరిత్రను తిరగరాస్తూ రికార్డులు సృష్టిస్తుంటే, తన కుమారుడు ఆ ఆనందానికి దూరమై, చేయని తప్పుకు కుమిలిపోతున్నాడంటూ ఆవేదన వెలిబుచ్చారు. 

ఇవాళ అల్లు అర్జున్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి అరవింద్ కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లాడారు. 

"ఆలిండియా లెవల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం పుష్ప-2. తన సినిమాను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వారి స్పందన ఎలా ఉంది అని స్వయంగా చూసుకునే అదృష్టం అతనికి లేకపోయింది. దురదృష్టకర ఘటనే అందుకు కారణం. 

ఓ తండ్రిగా నా బిడ్డ వేదన చూడలేకపోతున్నాను. ఇంట్లో గార్డెన్ లో ఓ మూల కూర్చుని దాని గురించే ఆలోచిస్తున్నాడు. దాంతో నేను... ఇలా ఉంటావేంటయ్యా.... వెళ్లి ఫ్రెండ్స్ ను కలువు, లేకపోతే ఊరికి వెళ్లు అని చెప్పాను. ఈ వ్యవహారం నుంచి కొంచెం బ్రేక్ తీసుకో... అస్తమానం దీని గురించే ఎందుకు బాధపడుతుంటావు అని అన్నాను. దేశమంతా నీ సినిమా గురించి మాట్లాడుకుంటున్న సమయంలో నువ్విలా కూర్చోవడం దురదృష్టకరం అని అన్నాను. 

ఇలా జరగాలని ఉంది... జరిగింది... ఆ విషయాన్ని నేను స్వీకరిస్తున్నాను... తర్వాత వెళతానులే అని బన్నీ బదులిచ్చాడు. ఒక అభిమాని ఫ్యామిలీకి జరిగిన నష్టం పట్ల అతను (అల్లు అర్జున్) బాధపడుతుంటే, అది చూసి ఓ తండ్రిగా నా కడుపు తరుక్కుపోతోంది. అందరూ ఒకటి ఆలోచించాలి... తను 22 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఇంతటి పేరు ఒక రోజుతో వచ్చింది కాదు, ఒక సినిమాతో వచ్చింది కాదు, ఒక ప్రెస్ మీట్ తో వచ్చింది కాదు, ఒక సంఘటనతో వచ్చింది కాదు... ఇది తను బిల్డప్ చేసుకున్నాడు. బిల్డప్ కూడా కాదు... ఈ పేరు మూడు తరాల నుంచి వస్తోంది. 

మా కుటుంబంలో మూడు తరాలను మీరు చూశారు. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామా? ఎప్పుడైనా ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతా రాహిత్యంతో ఉన్నామా? మేం ఎలాంటి మనుషులం అనేది జనాలకు తెలుసు. ప్రజల కళ్ల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కానీ తప్పుడు సమాచారంతో ఇవాళ ఒకరు మాట్లాడుతుంటే చాలా బాధ కలిగింది. 

దీనికి వివరణ ఇవ్వాలని అతను (అల్లు అర్జున్) చెప్పగానే... ఏదైనా న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయేమో కనుక్కున్నాం. ఇబ్బంది లేని విధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఇక, ఆ కుటుంబానికి ఏ విధమైన సాయం చేయాలన్నది త్వరలోనే అల్లు అర్జున్, మైత్రీ మూవీస్ వారు చర్చించి నిర్ణయం తీసుకుంటారు" అని అల్లు అరవింద్ వివరించారు.


More Telugu News