'సన్నీ లియోన్' ఖాతాలో నెలనెలా రూ.1000 జమ చేస్తున్న ఛత్తీస్ గఢ్ సర్కారు!

  • ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ స్కీంలో సన్నీ లియోన్ పేరు
  • వివాహిత మహిళల కోసం మహతారి వందన యోజన పథకం
  • సంక్షేమ పథకంలో అవినీతిపై మండిపడుతున్న ప్రతిపక్షాలు
ప్రముఖ నటి సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నెలనెలా రూ.వెయ్యి అందిస్తోంది. వివాహిత మహిళల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో సన్నీ లియోన్ ను అక్కడి అధికారులు లబ్దిదారుగా ఎంపిక చేశారు. నెలనెలా ఆమె ఖాతాలో రూ. వెయ్యి జమ చేస్తున్నారు. రికార్డులలో సన్నీ లియోన్ పేరు, ఫొటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ కు సంబంధం ఏంటి.. ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఆమెకు ఏంటనే సందేహిస్తున్నారా..? అక్కడి అధికారులకు మాత్రం ఎలాంటి సందేహం రాలేదు.

దరఖాస్తులను చూశారో లేదో, లేక తమకు ముట్టాల్సింది ముట్టగానే చకచకా సంతకాలు పెట్టేశారో కానీ సన్నీ లియోన్ పేరు మాత్రం లబ్దిదారుల జాబితాలో చేరింది. నెలనెలా ప్రభుత్వం ఆ ఖాతాలో డబ్బులు కూడా జమచేస్తోంది. బస్తర్ రీజియన్ లోని తాలూర్ గ్రామంలో ఈ మోసం బయటపడింది. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించగా.. గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి ఈ మోసానికి పాల్పడ్డట్లు తేలింది.

ఛత్తీస్ గఢ్ లోని బీజేపీ సర్కారు వివాహిత మహిళల కోసం ‘మహతారి వందన యోజన’ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద వివాహిత స్త్రీలకు నెలకు రూ. వెయ్యి చొప్పున అందజేస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకానికి అవినీతి మరక అంటుకుందని ప్రతిపక్షాలు ఆరోపించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఈ క్రమంలోనే ఓ యువకుడు సన్నీ లియోన్ పేరు, ఫొటో లతో బ్యాంకు ఖాతా తెరిచి ఈ పథకానికి దరఖాస్తు చేయగా.. అధికారులు కనీస పరిశీలన కూడా చేయకుండానే ఆమోదం తెలిపారు. కాగా, ఈ పథకంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. మహతారి వందన యోజన లబ్దిదారుల్లో దాదాపు సగం మంది ఫేక్ అని ఆరోపిస్తోంది. తాజా ఘటనే దీనికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.


More Telugu News