ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాదుల హతం

  • పంజాబ్, ఉత్తరప్రదేశ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్
  • ఉగ్రవాదులు ముగ్గురు 25 ఏళ్లలోపు వారే
  • ఈ నెల 21న గురుదాస్‌పూర్ ఔట్ పోస్టుపై దాడి చేసింది వీరే
  • ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఏకే 47, గ్లోక్ పిస్టళ్లు, లైవ్ రౌండ్స్ స్వాధీనం
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని గుర్వీందర్ సింగ్ (25), వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), జస్ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్ (18)గా గుర్తించారు. వీరు నిషేధిత ఖలిస్థాన్ కమాండో ఫోర్స్‌కు చెందని వారని పోలీసులు తెలిపారు. 

పంజాబ్, ఉత్తరప్రదేశ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో వీరు హతమైనట్టు అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా కలానౌర్ సబ్ డివిజన్ పోలీస్ పోస్టుపై ఈ నెల 21న జరిగిన దాడి ఘటనలో వీరు నిందితులుగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లోక్ పిస్టళ్లు, లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 

వాంటెడ్ ఉగ్రవాదులు ముగ్గురూ పిలిభిత్ జిల్లాలోని పురానపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచరిస్తున్నట్టు పిలిభిత్ పోలీసులకు పంజాబ్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి కోసం ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ ఉదయం ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.  


More Telugu News