హైడ్రా వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఊపు తగ్గిందా? అంటే రంగనాథ్ సమాధానం ఇదీ...

  • వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లో ఎందుకు పడిపోయిందని ప్రశ్న
  • దక్షిణాది అంతా రియాల్టీ డౌన్ అయిందన్న రంగనాథ్
  • హైడ్రాకు, రియాల్టీ డౌన్ కావడానికి సంబంధం లేదని వెల్లడి
హైదరాబాద్‌లో హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి తగ్గిందనే వాదనను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కొట్టి పారేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈటీవీ-తెలంగాణ ఏర్పాటు చేసిన ఫోన్-ఇన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా హైడ్రా కారణంగా హైదరాబాద్‌లో రియాల్టీ పడిపోయిందని అంటున్నారు కదా? అని ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు.

అసలు దక్షిణాది రియల్ ఎస్టేట్‌ రంగంలోనే డౌన్ ట్రెండ్ కనిపిస్తోందన్నారు. గణాంకాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుందన్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి పట్టణాల్లో కూడా రియాల్టీ తగ్గిందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అక్కడ హైడ్రా లేదు కదా అన్నారు. హైడ్రాకు, రియాల్టీ తగ్గడానికి సంబంధం లేదన్నారు.

హైడ్రా కేవలం చెరువులు తదితర వాటిని ఆక్రమించుకుని నిర్మించిన వాటినే కూల్చుతోందన్నారు. అదీ హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లడం లేదన్నారు. ప్రతి దానిని హైడ్రా ఖాతాలోకి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రియాల్టీ తగ్గడానికి హైడ్రానే కారణమైతే ఇతర ప్రాంతాల్లో కూడా ఎందుకు తగ్గిందో చెప్పాలన్నారు.

ఎక్కడా యూటర్న్ లేదు

హైడ్రా ఏర్పడిన తర్వాత జరిగిన అక్రమ నిర్మాణాలను కూల్చుతామని రంగనాథ్ వెల్లడించారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా బఫర్ జోన్ తెలుసుకునే అవకాశం ఇస్తామన్నారు. హైడ్రా ఏర్పడటానికి ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుతాయని వెల్లడించారు. హైడ్రా ఏ విషయంలోనూ యూటర్న్ తీసుకోలేదన్నారు. మొదటి రోజు నుంచి తాము నివాసాలను ముట్టుకోలేదన్నారు.

ఎన్ కన్వెన్షన్‌ను కూల్చాం కానీ...

ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కనే ఉన్న చిన్న చిన్న షెడ్లను తాము కూల్చలేదన్నారు. ఆ చిన్న షెడ్లకు సమయం ఇచ్చాం లేదా ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పామన్నారు. మొదటి రోజు నుంచి తాము అక్రమ నిర్మాణాల పైనే దృష్టి సారించామని, అనుమతులు ఉన్న వాటి జోలికి వెళ్లలేదన్నారు.

గాజుల రామారం చింతలచెరువు వద్ద 54 చిన్న ఇళ్లు ఉన్నాయని, కానీ అక్కడ పేదలను ముందు పెట్టి పెద్దలు వాటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సాధారణంగా ఎక్కడైనా కిరాయి ఉన్న వారు అద్దె కడతారని, కానీ ఇక్కడ అద్దెకు ఉన్న వారికే యజమాని డబ్బులు ఇస్తాడని తెలిపారు. పేదలను అందులో ఉంచి అనుమతులు పొందే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.


More Telugu News