అమెరికాలో క్రిస్మస్ ముంగిట... గంట పాటు నిలిచిపోయిన విమానాలు

  • క్రిస్మస్‌ ఈవ్‌పై టెక్నికల్‌ ఎఫెక్ట్‌ 
  • గంటపాటు నిలిచిపోయిన అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థ విమానాలు
  • ఫిర్యాదులపై స్పందించిన విమాన సంస్థ
క్రిస్మస్‌ వేడుకలకు ప్రపంచదేశాలు సిద్దమౌతున్న తరుణంలో, ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అమెరికన్ ఎయిర్ లైన్స్ వ్యవస్థలో సాంకేతిక లోపం అవరోధాలను సృష్టించింది. దీంతో అమెరికాలో ఆ సంస్థకు చెందిన పలు విమానాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్న సమయంలో ఇలాంటి లోపం తలెత్తడం అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థకు ఇబ్బందికరంగా మారింది. ప్రయాణికులు కూడా అసౌకర్యానికి గురయ్యారు.

అయితే, వెంటనే సాంకేతిక లోపాన్ని సవరించి నిషేధాన్ని ఎత్తివేసినట్టు ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది. దాదాపు గంటకు పైగా ఈ అంతరాయం కొనసాగినట్టు అమెరికన్ ఎయిర్ లైన్స్ తెలియజేసింది.  

ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు సిద్దంగా ఉన్నా ప్రయాణికులను అనుమతించకపోవడం, లోపాలు తలెత్తినట్టు ప్రకటించడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. దీంతో ప్రయాణికులు సోషల్‌ మీడియా వేదికగా ఫిర్యాదులు చేయడంతో అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానయాన సంస్థ వెంటనే స్పందించి రిప్లయ్ ఇచ్చింది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, కస్టమర్లకు క్షమాపణలు తెలియజేస్తున్నామని ప్రకటించింది. 

విమానాశ్రయాల్లో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విమానాశ్రయంలో ఏం జరుగుతుందో విమానయాన సంస్థలు ప్రకటనలు ఇస్తుంటాయి.  ప్రస్తుతం సిస్టమ్‌ డౌన్‌లో ఉందని, సిబ్బందిని అందుబాటులో ఉంచలేమని పేర్కొంటూ అమెరికన్ ఎయిర్ లైన్స్ తన ప్రకటనలో పేర్కొంది. అంతా సిద్దమై విమానాల్లోకి ఎక్కేందుకు సిద్దంగా ఉన్నప్పుడు ఈ విధమైన ప్రకటనలు చేయడంతో ఒక్కసారిగా విమానాశ్రయాల్లో అలజడి రేగింది.

ప్రతి ఏడాది క్రిస్మస్‌ ఈవ్‌ కు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ సమయంలోనే విమానయాన సంస్థలకు భారీ ఆదాయం లభిస్తుంది. ఈసారి రికార్డ్‌ స్థాయిలో ప్రయాణాలు చేసే అవకాశం ఉందని కథనాలు వెలువడిన నేపథ్యంలో ఇలాంటి సాంకేతిక లోపం తలెత్తడం ఆశ్చర్యానికి గురిచేసింది. గంట తరువాత సాంకేతిక లోపాన్ని సవరించి విమానాలను పునరుద్ధరించడంతో పరిస్థితి చక్కబడింది. 


More Telugu News