కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌కు అమెరికాలో శస్త్రచికిత్స.. ఫోన్ లో పరామర్శించిన సీఎం సిద్ధరామయ్య

  • శివరాజ్ కుమార్‌కు మియామి క్యాన్సర్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స
  • ఆయన ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆత్రుతతో ఎదురుచూసే శ్రేయోభిలాషుల్లో తానూ ఒకడినన్న సీఎం 
  • దేశంలోని అందరి ఆశీస్సులూ ఆయనకు ఉంటాయని వ్యాఖ్య  
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరామర్శించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివరాజ్ చికిత్స కోసం అమెరికా వెళ్లారు. మంగళవారం ఆయనకు అమెరికాలో శస్త్ర చికిత్స జరిగింది. శస్త్ర చికిత్సకు ముందు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. 
 
'అనారోగ్యంతో బాధపడుతున్న శివరాజ్ కుమార్‌కు శస్త్ర చికిత్స జరుగుతుండటంతో ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాను. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను. శివరాజ్ కుమార్ ధైర్యం, విశ్వాసం, దయాగుణమే ఆయన్ను ఈ పోరాటంలో విజేతగా నిలుపుతాయని విశ్వసిస్తున్నాను. జీవితంలో ఎదురైన ఈ చిన్న కష్టాన్ని అధిగమించి ఆరోగ్యంతో ఆయన తిరిగి రావాలని ఆత్రుతతో ఎదురుచూసే ఆయన శ్రేయోభిలాషుల్లో నేనూ ఒకడిని. ఈ దేశంలోని అందరి ఆశీస్సులూ ఆయనకు ఉంటాయి' అని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. 
 
కర్ణాటకలో శివన్నగా పాపులర్ అయిన శివరాజ్ కుమార్ శస్త్ర చికిత్స కోసం ఈ నెల 18న అమెరికా వెళ్లారు. మియామి క్యాన్సర్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకునేందుకు వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులు, అభిమానులను చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు.   


More Telugu News