చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

  • సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దామన్న చంద్రబాబు
  • ప్రేమ, శాంతి, సద్భావన అనేవి క్రీస్తు అందించిన సుగుణాలన్న పవన్
  • క్రీస్తు బోధనలు మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయన్న జగన్
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 'సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త యేసు క్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినం. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు. ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే మన ముందున్న కర్తవ్యం. ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందాం. సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దాం' అని చంద్రబాబు ట్వీట్ చేశారు. 

ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ప్రేమ, శాంతి, సద్భావన అనేవి క్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలని చెప్పారు. ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. 

ప్రేమ, కరుణ, క్షమ, సహనం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని జగన్ చెప్పారు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని అన్నారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News