కెన‌డా నుంచి అమెరికాకు భార‌తీయుల అక్ర‌మ ర‌వాణా.. రంగంలోకి ఈడీ

  • కెనడా విద్యాసంస్థల సహకారంతో దళారీ ఏజెన్సీల నిర్వాకం
  • ముంబ‌యికి చెందిన ఓ ఏజెన్సీ ప్రతి యేటా 25 వేల మందిని అక్ర‌మంగా యూఎస్‌ పంపినట్టు ఈడీ వెల్ల‌డి
  • భారత్‌లోని ముఠాలపై దర్యాప్తు చేప‌ట్టిన ఈడీ 
కెన‌డా నుంచి అమెరికాకు భార‌తీయుల అక్రమ రవాణా కేసులో కొన్ని కెనడా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, భారత్‌కు చెందిన సంస్థల పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ద‌ర్యాప్తు చేప‌ట్టింది. కెనడా నుంచి భార‌తీయ పౌరులను అమెరికాలోకి పంపేందుకు కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. ఈ క్ర‌మంలో అనుకోని సంఘ‌ట‌న‌ల‌తో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. త‌ర‌చూ ఈ కోవ‌కు చెందిన‌ ఘ‌ట‌న‌లు వెలుగు చూస్తున్నాయి. 

ఇలాంటి ఓ ఘ‌ట‌న 2022 జనవరి 19న జ‌రిగింది. కెనడా-అమెరికా సరిహద్దును అక్రమంగా దాటడానికి ప్రయత్నించే క్ర‌మంలో తీవ్రమైన చలికి తట్టుకోలేక గుజరాత్‌లోని డింగుచ గ్రామానికి చెందిన ఒకే ఫ్యామిలీలోని నలుగురు సభ్యులు మృత్యువాత ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై అహ్మదాబాద్‌ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న ఈడీ కొన్ని భారత సంస్థలపై మనీలాండరింగ్‌ కేసు పెట్టింది. 

ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దళారీ ఏజెన్సీలు అమెరికా వెళ్లాలనుకునే వారికి, ఆ దేశంలో కాకుండా మొద‌ట కెనడాలోని కొన్ని విద్యాసంస్థలు, విశ్వ‌విద్యాల‌యాల‌లో ప్రవేశాలు క‌ల్పిస్తాయి. కెనడా వీసా వచ్చిన వెంటనే వారు ఆయా విద్యాసంస్థల్లో చేరకుండా అక్రమంగా అమెరికా-కెనడా సరిహద్దు ద్వారా అగ్ర‌రాజ్యానికి వలసదారులుగా వెళ్లిపోతారు. 

ఆ తర్వాత కెనడాలోని ఆయా విద్యాసంస్థలు విద్యార్థులు క‌ట్టిన ఫీజులో కొంత మొత్తం తీసుకుని మిగ‌తాది వారికి తిరిగి ఇచ్చేస్తాయి. దీనికోసం ఆయా ద‌ళారీ ఏజెన్సీలు ఒక్కొ విద్యార్థి నుంచి రూ.55-60 లక్షలు వసూలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇలా ముంబ‌యికి చెందిన ఓ ఏజెన్సీ ప్రతి యేటా 25 వేల మంది, మరో సంస్థ 10 వేల మందిని యూఎస్‌ పంపినట్టు ఈడీ తెలిపింది.


More Telugu News