ప్రధానిగా మన్మోహన్ ఎంపిక.. ఆ రోజు సోనియా నివాసంలో ఏం జరిగిందంటే..!

  • ఓ సందర్భంలో వివరాలు వెల్లడించిన నట్వర్ సింగ్
  • లోక్ సభ ఎన్నికల్లో యూపీఏ కూటమి అనూహ్య విజయం
  • సోనియా గాంధీ ప్రధాని బాధ్యతలు చేపడతారని ప్రచారం
  • బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్, ఉమా భారతి వ్యాఖ్యలతో వివాదం
మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం నాటకీయంగా జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రిగా సేవలందించిన మన్మోహన్ ను దేశ ప్రధానిగా ఎంపిక చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రధాని సీటును చేపట్టే అవకాశాన్ని సోనియా వదులుకుంటారని, మన్మోహన్ ను ఆ సీట్లో కూర్చోబెడతారని ఎవరూ ఊహించలేదని కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ ఓ సందర్భంలో వెల్లడించారు.

2004 లోక్ సభ ఎన్నికల్లో యూపీఏ కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకోవడం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం రావడం కూడా కొంత ఆశ్చర్యకరమైన విషయమేనని చెప్పారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో వాజ్ పేయీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి విజయం సాధిస్తుందని ప్రచారం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీయే కూటమికి భారీ మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. ఆ పరిస్థితుల్లో యూపీఏ విజయం సాధించడమే అనూహ్యమని అనుకుంటే.. ప్రధాని పదవికి మన్మోహన్ ఎంపిక మరింత అనూహ్యమని నట్వర్ సింగ్ చెప్పారు. 

ప్రధాని పదవిని సోనియా చేపట్ట వద్దన్న రాహుల్..
ఎన్నికల ఫలితాల తర్వాత అప్పటి కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ నివాసంలో ప్రధాని ఎంపికపై చర్చ జరిగింది. యూపీఏ చైర్ పర్సన్ గా, కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సోనియా గాంధీ ప్రధాని పదవి చేపడతారని అప్పటికే బయట ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు, ఛాలెంజ్ లు చేస్తున్నారు. 

సోనియా గాంధీ ప్రధాని పదవి చేపడితే తాను శిరోముండనం చేయించుకుంటానని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఉమాభారతి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటలీలో జన్మించిన సోనియా ఇండియాకు ప్రధాని కావడానికి వీల్లేదంటూ ప్రతిపక్షాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై సోనియా కుటుంబంలో చర్చ జరిగిందని, తల్లి ప్రధాని పదవి చేపట్టడంపై రాహుల్ గాంధీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడని నట్వర్ సింగ్ చెప్పారు.

తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీ హత్యల విషయం గుర్తుచేసుకుంటూ రాహుల్ ఆందోళన చెందారని, అందుకే ప్రధాని పదవి చేపట్టవద్దని తల్లిని కోరారని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి పార్టీలో నమ్మకమైన నేత, ప్రజల్లో గౌరవం ఉన్న వ్యక్తి కోసం సోనియా ఆలోచన చేశారని తెలిపారు. చివరకు అప్పటికే ఆర్థిక మంత్రిగా మంచి పేరున్న మన్మోహన్ సింగ్ ను ప్రధాని పదవికి ఎంపిక చేస్తున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారని నట్వర్ సింగ్ పేర్కొన్నారు.


More Telugu News