అనుమతి లేకుండా సినిమాలో వీడియోలు.. తొలగించాలని కోర్టుకెక్కిన కన్నడ నటి రమ్య

  • వీడియోలు తొలగించాలని, కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్
  • నిర్మాతలు స్పందించకపోవడంతోనే కోర్టుకెక్కానన్న రమ్య
  • వీడియోలు తొలగిస్తే కేసు వెనక్కి తీసుకుంటానని స్పష్టీకరణ
తన అనుమతి లేకుండా ట్రైలర్, సినిమాలో వినియోగించిన తన సన్నివేశాలను తొలగించాలంటూ కన్నడ నటి, మైసూరు మాజీ ఎంపీ రమ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘హాస్టల్ హుడుగరు బేకాగిద్దారే’ మూవీలో తనకు తెలియకుండా తన సన్నివేశాలను వాడుకున్నారని పేర్కొంటూ రమ్య నిన్న కమర్షియల్ కోర్టును ఆశ్రయించారు.

ఆ మూవీ నుంచి తన వీడియోలు తొలగించడంతోపాటు కోటి రూపాయల పరిహారం ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. సినిమాలో వాడుకున్న తన వీడియోలను తొలగించాలని చిత్ర నిర్మాతలను పలుమార్లు కోరినా స్పందించలేదని తెలిపారు. వాటిని తొలగిస్తే కేసు వెనక్కి తీసుకుంటానని పేర్కొన్నారు. 

నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన  ‘హాస్టల్ హుడుగరు బేకాగిద్దారే’ బ్లాక్ కామెడీ, డ్రామా మూవీ. ఈ సినిమా విడుదలను ఆపాలని రమ్య గతంలో కోర్టును ఆశ్రయించినా, ఆమె పిటిషన్‌ను కొట్టివేయడంతో సినిమా సాఫీగా విడుదలైంది.


More Telugu News