ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవు... ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • ఇంటర్ పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం
  • ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహిస్తుందని వెల్లడి
  • సీబీఎస్ఈ విధానంతో ముందుకు సాగుతామన్న ప్రభుత్వం
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం సంస్కరణలను తీసుకొచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవని వెల్లడించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు.  

సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని కృతికా శుక్లా తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఎన్సీఈఆర్టీ పుస్తకాలను పెడుతున్నామని... దీనివల్ల నీట్, జేఈఈ వంటి జాతీయ పోటీ పరీక్షలకు సులభతరం అవుతుందని చెప్పారు. సీబీఎస్ఈ విధానంతో ముందుకు సాగుతామని అన్నారు.

సంస్కరణల్లో భాగంగానే ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలను తొలగించామని తెలిపారు. తొలి సంవత్సరం పరీక్షలను ఆయా కాలేజీలే అంతర్గతంగా నిర్వహిస్తాయని... ఇంటర్ సెకండియర్ పరీక్షలను మాత్రం ఇంటర్ బోర్డు నిర్వహిస్తుందని చెప్పారు. సంస్కరణలపై ఈ నెల 26 లోగా సలహాలు, సూచనలు పంపవచ్చని తెలిపారు.


More Telugu News