నాపై ఉన్న కేసు గురించి ఎవరూ ఆందోళన చెందవద్దు: కేటీఆర్

  • కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి ఇబ్బందులతో పోలిస్తే ఇవి లెక్క కాదన్న కేటీఆర్
  • తనపై నమోదైనది ఓ లొట్ట పీసు కేసు అని వ్యాఖ్య
  • రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు చెప్పాలని పిలుపు
తనపై నమోదైన ఫార్ములా ఈ-రేస్ కేసు గురించి పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను ఏ తప్పూ చేయలేదని, ఎవరికీ భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి ఇబ్బందులతో పోలిస్తే ఇప్పటివి పెద్ద లెక్క కాదన్నారు.

మనకు ఏదో ఇబ్బంది ఉన్నది అన్నట్లుగా కొంతమంది మాట్లాడారని, కానీ నిజంగా మనకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. తనపై నమోదైనది ఓ లొట్టపీసు కేసు అని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ కేసులో వారు చేసేదేమీ లేదన్నారు. కాబట్టి ఇబ్బంది ఉండదన్నారు. కేసులు అసలు సమస్యే కాదన్నారు.

ఈ కేసుపై తాను పోరాడతానన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ బిడ్డగా, ఆయన తయారు చేసిన సైనికుడిగా ఎంతో ధైర్యంగా ఉంటానన్నారు. 

తెలంగాణలో 90 లక్షల మంది మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తున్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు.


More Telugu News