సంక్రాంతికి ఊరెళుతున్నారా...? అయితే ఈ అలర్ట్ మీకోసమే!

  • సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళుతున్న ప్రజలు
  • నిర్మానుష్యంగా కనిపించనున్న పలు ప్రాంతాలు, కాలనీలు
  • సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ పోలీసుల కీలక సూచనలు
తెలుగు ప్రజల అతి పెద్ద పండుగ సంక్రాంతి. అంతే కాకుండా చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య ఇతరత్రా వ్యవహారాలతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఈ పండుగకు ప్రత్యేకంగా సొంతూళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతుంటారు. 

ఈ కారణంగా నగరాల్లో సగానికిపైగా ఇళ్లకు తాళాలు వేసి ఉంటాయి. ప్రజలు సొంతూళ్ల బాట పట్టడంతో నగరాల్లోని పలు ఏరియాలు జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తుంటాయి. ఇదే అదునుగా దొంగలు తమ హస్తలాఘవం ప్రదర్శిస్తుంటారు. ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో పండుగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. 

దొంగల నుంచి తాళం వేసిన మీ ఇంటిని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, వాటి పనితీరును పరిశీలించుకోవాలని, ఇంట్లో లైట్లు వేసి వెళ్లాలని, బంగారం, నగదు వంటి విలువైన వస్తువులు ఇళ్లలో ఉంచవద్దని, తాళం వేసిన సంగతి తెలియకుండా కర్టెన్ వేసి ఉంచాలని, పక్కింటివారికి సమాచారం ఇవ్వాలని, బీరువా తాళాలు ఇళ్లలో పెట్టవద్దని పోలీసులు సూచనలు చేశారు. 

ఊరెళ్లే వారు తమ అడ్రస్, ఫోన్ నెంబర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని, విలువైన వస్తువులు ఇళ్లలో ఉంచవద్దని, వాహనాలను రోడ్డు బయట కాకుండా ఇంటి ఆవరణలో పార్క్ చేసుకోవాలని, సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకుంటూ ఉండాలని తదితర సూచనలు చేశారు. ఈ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.      


More Telugu News