హై టెన్షన్.. న్యాయవాదితో కలిసి విచారణకు వెళుతున్న కేటీఆర్

  • ఫార్ములా ఈ-కార్ కేసులో ఏసీబీ విచారణకు వెళుతున్న కేటీఆర్
  • లాయర్ ను తీసుకెళ్లేందుకు అనుమతించిన తెలంగాణ హైకోర్టు
  • ఏసీబీ కార్యాలయం వద్ద భారీ భద్రత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకాబోతున్నారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్... నేడు ఏసీబీ విచారణను ఎదుర్కోబోతున్నారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తనతో పాటు లాయర్ ను తీసుకెళ్లనున్నారు. అయితే, సదరు లాయర్ ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీ గదిలో కూర్చుంటారు. విచారణ జరిగే గదిలోకి లాయర్ వెళ్లడానికి హైకోర్టు అనుమతించలేదు. 

ప్రస్తుతం నందినగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద సందడి నెలకొంది. కేటీఆర్ నివాసానికి ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు చేరుకున్నారు. న్యాయవాది రామచంద్రరావుతో పాటు లీగల్ టీమ్ కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు.

న్యాయవాది రామచంద్రరావుతో కలిసి ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లనున్నారు. కేటీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో... ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేసినట్టు సమాచారం. ఒకవేళ కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం.


More Telugu News