ఏఐ ద్వారా 19 ఏళ్ల నాటి ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

  • స్నేహితుడి సాయంతో ప్రేమించిన యువతి, కవలలను హత్య చేసిన సైనికోద్యోగి 
  • అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన కేరళ పోలీసులు
  • కోర్టు ఆదేశాలతో నిందితులను విచారిస్తున్న పోలీసులు
నేరం చేసిన వాళ్లు ఎంత కాలంపాటు తప్పించుకుని తిరిగినా చివరికి పోలీసులకు చిక్కడం ఖాయమని మరోసారి రుజువు అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో 19 ఏళ్ల క్రితం నాటి ట్రిపుల్ మర్డర్ కేసును కేరళ పోలీసులు ఛేదించారు. పేర్లు మార్చుకుని మహిళా టీచర్లను వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్న ఇద్దరు నిందితులను (సైనికాధికారులు) పోలీసులు అరెస్టు చేశారు. ఒక మహిళను ప్రేమ పేరుతో మోసం చేసి ఆమెను గర్భవతిని చేసిన ఓ సైనికాధికారి.. ఆమెకు కవల పిల్లలు జన్మించిన తర్వాత మొహం చాటేసి తన స్నేహితుడి సాయంతో పిల్లలు సహా ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత వారు ఇద్దరూ సైన్యం నుంచి పారిపోయారు. 
 
కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాకు చెందిన సైనికోద్యోగి దిబిల్ కుమార్ (28)కు 2005లో రంజిని అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వివాహం కాకుండానే కొల్లం జిల్లా అంచల్ పట్టణంలో సహజీవనం చేశారు. దీంతో ఆమె గర్భవతి అయింది. ఆ సమయంలో దిబిల్ కుమార్ దేశ సరిహద్దులో సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు. రంజిని గర్భవతి అనే విషయం తెలిసి తనకు ఆమె గర్భంతో సంబంధం లేదని మొహం చాటేశాడు. దీంతో బాధితురాలు రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ కు దిబిల్ కుమార్‌పై ఫిర్యాదు చేసింది. ఈ పరిణామంతో దిబిల్ కుమార్ సైన్యంలోని తన సహచర మిత్రుడు రాజేశ్‌ను సంప్రదించాడు. దీంతో బాధితురాలి తల్లి వద్దకు రాజేశ్ వెళ్లి తాను సమస్య పరిష్కరిస్తానని, దిబిల్ కుమార్ తో వివాహం జరిపిస్తానని నమ్మబలికాడు. 

ఫిబ్రవరి 10, 2006న రంజిని తల్లి .. కుమార్తె పిల్లల బర్త్ సర్టిఫికేట్ల కోసం బయటకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న రంజిని, ఆమె ఇద్దరు కవల పిల్లలను రాజేశ్, దిబిల్ హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలించినా ఫలితం దక్కలేదు. ఇండియన్ ఆర్మీకి కూడా వారిద్దరూ హత్య కేసు నిందితులను తెలియజేశారు. అయితే వీరిద్దరూ సైనిక విధులకు హజరు కావడం లేదని 2006 మార్చిలో సైన్యం నుంచి పారిపోయిన వారి జాబితాలో చేర్చారు. ఈ కేసు కేరళ హైకోర్టు వరకూ చేరడం, నిందితులు ఇద్దరూ చాలా కాలంగా పరారీలో ఉండటంతో హైకోర్టు 2010లో ఈ కేసును సీబీఐ అధికారులు విచారణ చేయాలని ఆదేశించింది. 

నిందితుల ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ.2లక్షల బహుమానం కూడా ప్రకటించారు. అయినా 19 ఏళ్ల వరకు ఇద్దరి ఆచూకీ లభించలేదు. అయితే వారం రోజుల క్రితం సిబీఐ అధికారులకు నిందితుల గురించి సమాచారం అందింది. ఇద్దరూ పాండిచ్చేరిలో మారు పేర్లతో ఉన్నారని, అక్కడ టీచర్ ఉద్యోగం చేస్తున్న ఇద్దరు కేరళ మహిళలను పెళ్లి చేసుకుని పిల్లలతో ఉన్నారని తెలుసుకున్నారు. ఏఐ సాయంతో సీబీఐ అధికారులు నిందితులను ధ్రువీకరించుకున్న తర్వాత అరెస్టు చేశారు. ఎర్నాకులం కోర్టులో నిందితులను ప్రవేశపెట్టారు. ఈ నెల 18వ తేదీ వరకు విచారణ కోసం పోలీస్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. దీంతో నిందితులను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.  


More Telugu News