వెన్నునొప్పి సమస్యపై న్యూజిలాండ్ సర్జన్‌ను సంప్రదించిన జస్ప్రీత్ బుమ్రా!

  • న్యూజిలాండ్‌ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోవాన్ సచౌటెన్‌ను సంప్రదించిన స్టార్ పేసర్
  • బీసీసీఐ వైద్యులతో మాట్లాడుతున్న కివీస్ వైద్యుడు
  • బుమ్రా పరిస్థితిపై అతిత్వరలోనే సెలక్టర్లకు సమాచారం ఇచ్చే అవకాశం
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు అందుబాటులో ఉండడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇటీవలే ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో వెన్నునొప్పి బారినపడడం ఈ ఆందోళనలకు కారణమవుతోంది. వెన్నునొప్పి సమస్యపై న్యూజిలాండ్‌కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోవాన్ సచౌటెన్‌ను బుమ్రా సంప్రదించినట్టు తెలుస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్‌తో డాక్టర్ రువాన్ మాట్లాడుతున్నారని, సమస్య తీవ్రతపై బీసీసీఐ సెలక్టర్లకు అతిత్వరలోనే సమాచారం అందివ్వనున్నారని ‘హిందుస్థాన్ టైమ్స్’ పేర్కొంది. 

ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయనున్న 15 మంది ఆటగాళ్ల జాబితాలో బుమ్రా పేరు ఉండే అవకాశం ఉందని, అయితే ఎలాంటి నొప్పి లేకుంటేనే అతడు తుది జట్టులో కొనసాగుతాడని కథనం విశ్లేషించింది.

కెప్టెన్సీ బాధ్యతలు బుమ్రాపై భారం: మహ్మద్ కైఫ్
రోహిత్ శర్మ వారసుడు జస్ప్రీత్ బుమ్రా అని, కెప్టెన్సీ బాధ్యతలు అతడికే దక్కబోతున్నాయంటూ జోరుగా విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ బాధ్యతలు బుమ్రాకు భారంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశాడు. ఫిట్‌నెస్‌‌తో పాటు దీర్ఘకాలం క్రికెట్‌లో కొనసాగడం ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు. బుమ్రాకు ఫుల్ టైమ్ కెప్టెన్సీని అప్పగించడం తప్పిదం అవుతుందని, ఈ విషయంలో బీసీసీఐ ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని కైఫ్ సూచించాడు. ఫిట్‌గా ఉండడం, వికెట్లు తీయడంపై మాత్రమే బుమ్రా దృష్టిసారించాలని సూచించాడు.


More Telugu News