తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండు కేసుల నమోదు

  • తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద విషాద ఘటన
  • తొక్కిసలాటలో పలువురు భక్తుల మృత్యువాత
  • తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు
తిరుపతిలో గత రాత్రి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. పద్మావతి పార్కులో ఘటనపై నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదుతో ఒక కేసు నమోదైంది. విష్ణునివాసం వద్ద ఘటనపై బాలయ్యపల్లె తహసీల్దార్ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. 

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం గత రాత్రి 12 గంటల నుంచి క్యూలైన్లలోకి అనుమతించనుండగా... తిరుపతిలోని బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద టోకెన్ల కోసం  చేరుకున్న భక్తులను సమీపంలోని పద్మావతి పార్కులోకి పంపించారు. 

అయితే ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ఓ భక్తుడు రాత్రి 8 గంటల సమయంలో అస్వస్థతకు గురికావడంతో అతడిని పార్కు నుంచి బయటికి తీసుకువచ్చేందుకు సిబ్బంది గేట్లు తెరిచారు. దాంతో భక్తులు ఒక్కసారిగా బయటికి దూసుకురావడంతో తోపులాట జరిగి ఐదుగురు మరణించారు. మరో భక్తుడు అంతకుముందే విష్ణునివాసం వద్ద అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచాడు.


More Telugu News