విజయసాయి రాజీనామా ప్రకటనపై సోమిరెడ్డి రియాక్షన్

  • రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయి ప్రకటన
  • ఈ ప్రకటన విచిత్రంగా ఉందన్న సోమిరెడ్డి
  • పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్టా అని వ్యాఖ్య
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం ప్రకటనపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. ఎక్స్ వేదికగా సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందన్నారు. సేద్యం చేస్తానంటున్నావ్ .. దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా..? ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని ప్రశ్నించారు. 

2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి ఏ 2 గా సకల పాపాలు చేశావని, గత ఐదేళ్లు అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండ్‌గా నిలిచి ఏ 2 స్థానాన్ని కొనసాగించావని విమర్శించారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్టా అని నిలదీశారు. ముందు అప్పుడు దోచుకున్న రూ.43 వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్‌తో కలిసి దోచేసిన లక్ష కోట్ల రూపాయల ప్రజల సొత్తు బయటపెట్టు. దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు. అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉందని అన్నారు. 
 
మొత్తంగా చూస్తే చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అంతేనా లేక నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ రాజీనామాల పరంపర ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్టు కూడా లేదని, రాత్రికో, రేపు రాత్రి లోపల మరో ఒకరిద్దరు సభ్యులు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కరలేదంటూ సోమిరెడ్డి ట్వీట్‌లో రాసుకొచ్చారు.    


More Telugu News