'ఏఐ ఏజెంట్' ను మరిన్ని దేశాలకు విస్తరించిన చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ

  • భారత్ సహా మరి కొన్ని దేశాలకు అందుబాటులోకి ఏఐ ఏజెంట్ సేవలు
  • ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించిన ఓపెన్ ఏఐ సంస్థ
  • త్వరలో యూరోపియన్ దేశాలకు ఏఐ ఏజెంట్ సేవలు
కృత్రిమ మేధస్సు సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు ఓపెన్ ఏఐ సంస్థ సరికొత్తగా ఏఐ ఏజెంట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. మనుషులకు వర్చువల్ సహోద్యోగులుగా మారే ఈ ఏఐ ఏజెంట్ సేవలను ఇప్పుడు మరిన్ని దేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా వెల్లడించింది. వినియోగదారులు ఇచ్చే సూచనల ఆధారంగా ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా పనులు నిర్వహించే సామర్థ్యంతో ఈ ఏఐ ఏజెంట్ పనిచేస్తుంది.

గతంలో అమెరికాలో చాట్ జీపీటీ ప్రో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఏఐ ఏజెంట్ ఇప్పుడు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, భారత్, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. స్విట్జర్లాండ్, నార్వే, లీచ్టెన్‌స్టెయిన్, ఐస్‌లాండ్‌తో సహా కొన్ని యూరోపియన్ దేశాలలో దీనిని ఉపయోగించేందుకు మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంది.

కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు చేసే పనిని ఈ ఏఐ ఏజెంట్స్ పూర్తి చేయగలవని గతంలో ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. అయితే, ఈ ఏజెంట్లకు కేటాయించిన పనిని మాత్రమే అవి పూర్తి చేయగలవని, సొంతంగా ఆలోచించగలిగే జ్ఞానం వాటికి లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో కూడా ఏఐ ఏజెంట్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ఏఐ ఏజెంట్ పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు కానీ, ఆ రంగంపై మాత్రం ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. 


More Telugu News