ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు... షెడ్యూల్ విడుదల

  • ఏపీ తెలంగాణల్లో వచ్చే నెలలో ఖాళీ కానున్న 10 ఎమ్మెల్సీ స్థానాలు
  • ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదల
  • మార్చి 20న ఎన్నికలు... అదే రోజున లెక్కింపు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో మొత్తం 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దాంతో, ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నేడు షెడ్యూల్ విడుదలైంది. 

ఏపీలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, డి.రామారావు, పి. అశోక్ బాబు, తిరుమలనాయుడు పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. తెలంగాణలో సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మీర్జా రియాజుల్ హసన్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశంల పదవీకాలం కూడా వచ్చే నెలతో ముగియనుంది. 

ఈ నేపథ్యంలో, ఆయా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 10 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 11న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు ఇచ్చారు. మార్చి 20న ఎన్నికలు నిర్వహించనున్నారు. 

ఓట్ల లెక్కింపు కూడా మార్చి 20న పోలింగ్ ముగిశాక సాయంత్రం 5 గంటల నుంచి చేపడతారు. కాగా, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.


More Telugu News