ఒక వర్గం కోసం టెన్త్ పరీక్షల టైమ్ టేబుల్ మార్చుతారా?: బండి సంజయ్

  • టెన్త్ ఫ్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకూ నిర్వహించాలని నిర్ణయం
  • రంజాన్ కోసం ఇష్టం వచ్చినట్లుగా టెన్త్ పరీక్షల టైమ్ టేబుల్ మారుస్తారా అని నిలదీసిన బండి సంజయ్
  •  పరీక్షా టైంటేబుల్ మార్చాలని డిమాండ్
ఒక వర్గం కోసం పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ మారుస్తారా అంటూ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని ఈ నెల 6 నుంచి నిర్వహించే పదవ తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకూ నిర్వహించాలని తెలంగాణలో రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

రంజాన్ కోసం ఇష్టమొచ్చినట్లుగా పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ మారుస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక వర్గం వారి కోసం మరో వర్గం వారిని ఇబ్బందికి గురి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని అన్నారు. ఈ సమయంలో విద్యార్థులు, అధ్యాపకులు సహా ప్రతి ఒక్కరూ భోజనం చేస్తారని, అదే సమయానికి పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు.

రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4 గంటల తర్వాత విధులనుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని అన్నారు. పాఠశాలల వేళలు సైతం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తాయని తెలిపారు. అయినప్పటికీ మళ్లీ రంజాన్ పేరుతో వేళాపాళా లేకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో ఇదేనా సమానత్వమంటే అని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులకు, అధ్యాపకులకు ఇబ్బంది లేకుండా పదవ తరగతి ప్రీఫైనల్ పరీక్షా టైంటేబుల్‌ను మార్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 


More Telugu News