కెప్టెన్ రోహిత్‌పై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు.. స్పందించిన బీసీసీఐ!

  • కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌పై కాంగ్రెస్ నేత‌ షమా మహ్మద్ బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు
  • లావుగా ఉంటాడని, బరువు తగ్గాల్సిన అవసరం ఉందన్న కాంగ్రెస్ నాయకురాలు
  • టీమిండియా సార‌థిపై ఆమె వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్న బీసీసీఐ
  • వ్య‌క్తిగ‌త ప్ర‌చారం కోసం ఇలాంటి వ్యాఖ్య‌లు స‌రికాద‌న్న‌ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా
భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్‌శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు చేశారు. అతను లావుగా ఉంటాడని, బరువు తగ్గాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అతడి ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండదని, దేశ చరిత్రలో ఆకట్టుకోలేని కెప్టెన్ అతడేనని, అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడంటూ ఆమె త‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) పోస్టులో రాసుకొచ్చారు. 

అలాగే సచిన్, ద్రావిడ్, ధోనీ, కోహ్లీ, కపిల్‌దేవ్ వంటి భారత దిగ్గజాలతో పోలిస్తే అతడెంత అని అన్నారు. సామాజిక మాధ్య‌మాల్లో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. బీజేపీ నేతలతో పాటు క్రికెట్ అభిమానులు కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

తాజాగా బీసీసీఐ కూడా హిట్‌మ్యాన్‌పై షమా మహ్మద్ బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలపై స్పందించింది. టీమిండియా సార‌థిపై ఆమె వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ ఇది చాలా దురదృష్టకరం అని అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయ‌కురాలి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

ఒక అంత‌ర్జాతీయ టోర్న‌మెంట్ జ‌రుగుతున్న వేళ బాధ్య‌తాయుత‌మైన వ్య‌క్తి ఇలా మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు. ఆట‌గాళ్లంద‌రూ అద్భుతంగా ఆడుతున్నార‌ని దాని ఫ‌లితాలు కూడా చూస్తున్నామ‌ని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌తంగా ఆటగాడిపైనా లేదా జ‌ట్టుపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపించి నైతిక స్థైర్యాన్ని దెబ్బ‌తీస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌చారం కోసం ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాల‌ని సైకియా హితవు ప‌లికారు.

మ‌రోవైపు తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను షమా మహ్మద్ స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. అది తాను చేసిన సాధారణ ట్వీట్ అని, రోహిత్‌ను బాడీ షేమ్ చేసే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. తన అభిప్రాయం ప్రకారం రోహిత్ కొంచెం అధిక బరువు ఉన్నాడని మాత్ర‌మే తాను చెప్పాన‌ని అన్నారు. 

"ఇది ఒక క్రీడాకారుడి ఫిట్‌నెస్ గురించి ఒక సాధారణ ట్వీట్. ఇది బాడీ షేమింగ్ కాదు. ఒక క్రీడాకారుడు ఫిట్‌గా ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. అతను కొంచెం అధిక బరువుతో ఉన్నాడని నేను భావించాను. అందుకే నేను దాని గురించి ట్వీట్ చేశాను. ఎటువంటి కారణం లేకుండా నాపై విమ‌ర్శ‌ల‌ దాడి జరిగింది. నేను అతనిని మునుపటి కెప్టెన్లతో పోల్చి వ్యాఖ్య‌లు చేయ‌డానికి నాకు హక్కు ఉంది. అలా చెప్పడంలో తప్పేముంది? ఇది ప్రజాస్వామ్యం" అని ఆమె అన్నారు.  


More Telugu News