ఆరోపణలు చేయడం కాదు... ఆధారాలు ఉంటే బయటపెట్టు: చెవిరెడ్డికి పులివర్తి సుధారెడ్డి సవాల్

  • తాను రూ. 50 లక్షలు లంచం తీసుకున్నానని చెవిరెడ్డి అంటున్నారని సుధారెడ్డి ఆగ్రహం
  • అఫిడవిట్ లో చెవిరెడ్డి ఆస్తులను తప్పుగా చూపించారని ఆరోపణ
  • వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డిపై పోటీ చేస్తానన్న సుధారెడ్డి
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూ. 50 లక్షలు లంచం తీసుకున్నానని తనపై చెవిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని... ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. అవినీతి చేసిన చెవిరెడ్డి కచ్చితంగా జైలుకు పోతారని అన్నారు. 

ఎన్నికల అఫిడవిట్ లో చెవిరెడ్డి ఆస్తులను తప్పుగా చూపించారని విమర్శించారు. చెవిరెడ్డి, ఆయన భార్య ఆస్తుల వివరాలను కరపత్రాలు చేయించి ప్రతి ఇంటికి పంచుతానని చెప్పారు. తన భర్తను ఎదుర్కోలేకే తనపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మగవాళ్లు మగవాళ్లతో పోరాటం చేయాలని... మహిళనైన తనపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి నియోజకవర్గం రెండు స్థానాలు అవుతుందని... చంద్రగిరి నుంచి తాను కచ్చితంగా చెవిరెడ్డిపై పోటీ చేస్తానని సుధారెడ్డి చెప్పారు. మహిళగా చంద్రబాబు తనకు అవకాశం ఇస్తారని అన్నారు. మఠం భూములను చెవిరెడ్డి ఐదేళ్లుగా దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన భిక్షతో నీ కొడుకు బయట తిరుగుతున్నాడని అన్నారు. రేపటి నుంచి చెవిరెడ్డి అవినీతిపై పోరాటం చేస్తానని చెప్పారు.  


More Telugu News