అమెరికాకు హెచ్చరిక.. తొలి అణు జలాంతర్గామిని ఆవిష్కరించిన ఉత్తర కొరియా

  • దక్షిణ కొరియా, అమెరికా లక్ష్యంగా అణు జలాంతర్గామిని నిర్మిస్తున్న నార్త్ కొరియా
  • ‘అణు ఆధారిత వ్యూహాత్మక గైడెడ్ మిసైల్ జలాంతర్గామి’గా అభివర్ణించిన ఆ దేశ మీడియా
  • 10 క్షిపణులను మోసుకెళ్లగలిగే సామర్థ్యం దీని సొంతం
దక్షిణ కొరియా, అమెరికాలకు సైనికంగా సవాలు విసురుతున్న ఉత్తర కొరియా తాజాగా రష్యా సాయంతో అభివృద్ధి చేసిన నిర్మాణంలో ఉన్న తొలి అణు జలాంతర్గామిని ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆ దేశ అధికారిక మీడియా శనివారం విడుదల చేసింది. దీనిని ‘అణు ఆధారిత వ్యూహాత్మక గైడెడ్ మిసైల్ జలాంతర్గామి’గా అభివర్ణించింది. దీనిని నిర్మిస్తున్న షిప్‌యార్డ్‌ను ఆ దేశ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ సందర్శించినట్టు పేర్కొంది. అయితే, అంతకుమించి వివరాలను వెల్లడించలేదు.
   ఈ నౌక 6 వేల టన్నుల తరగతి లేదా, 7 వేల టన్నుల తరగతికి చెందినదిలా కనిపిస్తోందని, 10 క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉందని సియోల్‌లోని హన్యాంగ్ యూనివర్సిటీలో బోధకుడిగా పనిచేస్తున్న దక్షిణ కొరియా జలాంతర్గామి నిపుణుడు మూన్ క్యూన్ సిక్ తెలిపారు. ‘వ్యూహాత్మక గైడెడ్ క్షిపణులు’ అనే పదాన్ని ఉపయోగించారంటే అది అణ్వాయుధ సామర్థ్యం కలిగినదని అర్థమని ఆయన పేర్కొన్నారు. తమను (దక్షిణ కొరియా), అమెరికాను భయపెట్టేందుకే దీనిని నిర్మిస్తున్నారని ఆయన వివరించారు. ఈ విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని, కాకపోతే అంతకుమించిన వివరాలు తెలియరాలేదని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి బ్రియాన్ హక్స్ పేర్కొన్నారు.   
   


More Telugu News