ధోనీ బ్యాటింగ్ స్థానంపై షేన్ వాట్సన్ కీలక వ్యాఖ్యలు

  • నిన్న బెంగళూరు చేతిలో చెన్నై ఓటమి
  • ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావాలని వాట్సన్ సూచన
  • సీఎస్కే జట్టు కూర్పుపై వాట్సన్ అసంతృప్తి
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక, ఆటగాడిగా కొనసాగుతున్న ఎంఎస్ ధోనీ... బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన వస్తున్నాడు. దాంతో ధోనీకి ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం లభించడంలేదు. దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వాట్సన్ స్పందించాడు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చి ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు. ధోనీ ఆటతీరును అభిమానులు ఎంతగానో ఆస్వాదిస్తున్నారని, అతను మరింత ముందుగా వచ్చి ఎక్కువ పరుగులు చేయాలని కోరుకుంటున్నారని తెలిపాడు. 43 ఏళ్ల వయసులో కూడా ధోనీ వికెట్ కీపింగ్ నైపుణ్యాలు అద్భుతంగా ఉన్నాయని వాట్సన్ కొనియాడాడు.

స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ వాట్సన్, ధోనీ కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేశాడని పేర్కొన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ కంటే ముందే అతను క్రీజులోకి వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని, ధోనీ మరో 15 బంతులు ఆడి ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించేదని తెలిపాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూర్పు కూడా సరిగా లేదని వాట్సన్ విమర్శించాడు. దీపక్ హుడా తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడని, శామ్ కరన్ ఐదో స్థానంలో కాకుండా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుందని సూచించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ఇదే బ్యాటింగ్ లైనప్‌ను కొనసాగిస్తే రాబోయే మ్యాచ్‌లలోనూ ఇబ్బందులు తప్పవని షేన్ వాట్సన్ హెచ్చరించాడు. నిన్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించిన విషయం తెలిసిందే. బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి 196 పరుగులు చేయగా, చెన్నై జట్టు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.



More Telugu News