కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫోగాట్‌కు బీజేపీ ప్ర‌భుత్వం రూ. 4 కోట్ల న‌గదు బ‌హుమ‌తి

  • గ‌తేడాది ఒలింపిక్స్ ఫైన‌ల్లో అధిక బ‌రువు కార‌ణంగా డిస్ క్వాలిఫై అయిన రెజ్ల‌ర్‌
  • అయినా ఆమెకు ప‌త‌క విజేత‌ల‌కు ఇచ్చే గౌర‌వాన్నే ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం
  • వినేశ్‌కు ఇల్లు, ప్ర‌భుత్వ ఉద్యోగం, న‌గ‌దు బ‌హుమ‌తి వంటి మూడు ఆప్ష‌న్లు ఇచ్చి స‌ర్కార్‌
  • న‌గ‌దు బ‌హుమ‌తికే మొగ్గు చూపిన వినేశ్ ఫోగాట్‌
  • దీంతో ఆమెకు రూ. 4 కోట్ల క్యాష్ ప్రైజ్ ఇవ్వ‌నున్న బీజేపీ ప్ర‌భుత్వం
భార‌త మాజీ రెజ్ల‌ర్‌, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫోగాట్‌కు హ‌ర్యానాలోని బీజేపీ ప్ర‌భుత్వం రూ. 4 కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టించింది. గ‌తేడాది ఒలింపిక్స్‌లో 50 కిలోల కేట‌గిరీలో అధిక బ‌రువు కార‌ణంగా వినేశ్ ఫైన‌ల్లో డిస్ క్వాలిఫై కావ‌డంతో తృటితో ప‌త‌కం చేజార్చుకున్న విష‌యం తెలిసిందే. 

అయితే, ఆమెకు ప‌త‌క విజేత‌ల‌కు ఇచ్చే గౌర‌వాన్నే ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో వినేశ్ ముందు ఇల్లు, ప్ర‌భుత్వ ఉద్యోగం, న‌గ‌దు బ‌హుమ‌తి వంటి మూడు ఆప్ష‌న్ల‌ను హ‌ర్యానాలోని బీజేపీ స‌ర్కార్ ఉంచింది. మూడింటిలో ఏది కావాలో ఎంచుకోవాల‌ని సూచించ‌గా ఆమె న‌గ‌దు బ‌హుమ‌తికే మొగ్గు చూపారు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం వినేశ్‌కు రూ. 4 కోట్ల క్యాష్ ప్రైజ్ ఇవ్వ‌నుంది. 

కాగా, వినేశ్ ఫోగాట్ గ‌తేడాది జ‌రిగిన హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున జులానా నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన విష‌యం తెలిసిందే. 

ఇక ఆమె ప‌ర్స‌న‌ల్ లైఫ్ విషయానికి వ‌స్తే... వినేశ్‌కు ప్ర‌ముఖ రెజ్ల‌ర్ సోమ్‌వీర్ రాఠీతో వివాహ‌మైంది. ప్ర‌స్తుతం ఆమె నిక‌ర ఆస్తి విలువ సుమారు రూ. 40 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం. ఆమెకు హర్యానాలోని ఖార్ఖోడాలో రూ.2 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది. అలాగే రూ.1.8 కోట్ల విలువైన మెర్సిడెస్ జీఎల్ఈ, వోల్వో ఎక్స్‌సీ60 వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.


More Telugu News