2028 ఒలింపిక్స్‌లో ఒకే జ‌ట్టుగా బ‌రిలోకి ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌

  • బ్రిట‌న్‌కు చెందిన అథ్లెట్లు మొత్తం బ్రిటీష్ జ‌ట్టుగానే ఒలింపిక్స్‌ బ‌రిలోకి
  • గ్రేట్ బ్రిట‌న్‌గా ఒకే జ‌ట్టుగా బ‌రిలోకి దిగ‌నున్న ఇంగ్లండ్‌, స్కాట్లాండ్
  • ఈ మేర‌కు స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ ట్రాడీ లిండ్‌బ్లెడ్ ప్ర‌క‌టన‌
లాస్ ఏంజెలిస్‌లో జ‌రిగే 2028 ఒలింపిక్స్‌లో ఇంగ్లండ్‌, స్కాట్లాండ్ ఒకే జ‌ట్టుగా బ‌రిలోకి దిగ‌నున్నాయి. ఈ మేర‌కు స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ ట్రాడీ లిండ్‌బ్లెడ్ ప్ర‌క‌టించారు. బ్రిట‌న్‌కు చెందిన అథ్లెట్లు మొత్తం బ్రిటీష్ జ‌ట్టుగానే బ‌రిలోకి దిగ‌నున్నారు. 

ఈ సంద‌ర్భంగా ట్రాడీ లిండ్‌బ్లెడ్ మాట్లాడుతూ... "మాకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో మంచి అనుబంధం ఉంది. గ్రేట్ బ్రిట‌న్‌గా బ‌రిలోకి దిగేందుకు ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిపాం. పురుషులు, మ‌హిళ‌ల విభాగంలో ఆరేసి జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్న ఈ విభాగంలో గ్రేట్ బ్రిట‌న్‌గా బ‌రిలోకి దిగుతాం. జ‌ట్టు కూర్పు ఎలా అనే దానిపై మునుముందు నిర్ణ‌యం తీసుకుంటాం. బ్రిటీష్ ఒలింపిక్ అసోసియేష‌న్ కోసం మేమంతా క‌లిసి ఆడేందుకు సిద్ధం" అని అన్నారు. 

ఇక‌, దాదాపు 128 ఏళ్ల త‌ర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్‌కు చోటు ద‌క్కిన విష‌యం తెలిసిందే. 1900 ఒలింపిక్స్ లో చివ‌రిసారిగా క్రికెట్ ఆడ‌టం జ‌రిగింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లోనే క్రికెట్ ఆట క‌నిపించ‌నుంది. ఇప్ప‌టికే క్రికెట్‌కు సంబంధించిన కార్యాచ‌ర‌ణ గురించి అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. 

పురుషులు, మ‌హిళ‌ల విభాగంలో ఆరేసి జ‌ట్లు ఆడ‌తాయి. ఒక్కో టీమ్ నుంచి 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. టీ20 ఫార్మాట్‌లో పోటీలు ఉంటాయి. కాగా, లాస్ ఏంజెలిస్ వేదిక‌గా 2028 జూన్ 14 నుంచి జులై 30 వ‌ర‌కు ఒలింపిక్స్ జ‌రుగుతాయి.   


More Telugu News