పహల్గామ్ ఉగ్ర‌దాడి... న‌లుగురు ఉగ్ర‌వాదుల ఫొటోలు విడుద‌ల‌

  • అనుమానిత ఉగ్రవాదుల ఫొటోతో పాటు వారి స్కెచ్‌లను విడుదల చేసిన‌ భద్రతా సంస్థలు
  • ముగ్గురు ఉగ్రవాదులు ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తింపు
  • ప్రధాన సూత్రధారి ఎల్ఈటీ కమాండర్ సైఫుల్లా కసూరిగా నిఘా సంస్థల వెల్ల‌డి
జ‌మ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగ‌ళ‌వారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించగా, ప‌లువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక ఉన్న అనుమానిత ఉగ్రవాదుల ఫొటోలతో పాటు వారి స్కెచ్‌లను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు.

నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్‌) సభ్యులే పహల్గామ్‌లోని బైసారన్ లో పర్యాటకులపై కాల్పులు జరిపిన‌ట్లు పేర్కొన్నాయి. కనీసం 5 నుంచి ఆరుగురు ఉగ్రవాదులు కుర్తా-పైజామాలు ధరించి, లోయ చుట్టూ ఉన్న దట్టమైన పైన్ అడవి నుంచి బైసరన్ గడ్డి మైదానానికి వచ్చి ఏకే-47 లతో కాల్పులు జరిపిన‌ట్లు నిర్ధారించాయి. 

ఈ దాడికి కొన్ని రోజుల ముందు లోయలోకి చొరబడిన పాకిస్థానీ ఉగ్రవాదులు ఈ బృందంలో ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. ఇక‌, ఈ మారణహోమానికి ప్రధాన సూత్రధారి ఎల్ఈటీ కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ అని నిఘా సంస్థలు గుర్తించాయి. అటవీ ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని అక్కడి నుంచి పారిపోయిన ఉగ్రవాదులను బంధించేందుకు భద్రతా దళాలు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. దీనికోసం భారీగా హెలికాప్టర్లను మోహరించాయి.

ప్రాథమిక ఫోరెన్సిక్ విశ్లేషణ, ప్రాణాలతో బయటపడిన వారి సాక్ష్యాల ప్రకారం, ఉగ్రవాదులు సైనిక-స్థాయి ఆయుధాలు, అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించారని తెలుస్తోంది. దాడి చేసిన వారు పూర్తి సన్నద్ధతతో వచ్చారు. డ్రై ఫ్రూట్స్ మరియు మందులను నిల్వ చేసుకున్నారు. ఉగ్రవాదులు స్థానికుల సహాయంతో పహల్గామ్‌కు కూడా వెళ్లిన‌ట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

ముగ్గురు ఉగ్రవాదులు ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హా స్కెచ్‌లివే..


More Telugu News