పహల్గాం ఉగ్రదాడి.. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అమిత్ షా కీలక ఆదేశాలు

  • పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు
  • పాకిస్థాన్‌కు సంబంధించిన వీసాల రద్దుకు కేంద్ర హోంశాఖ యోచన
  • రాష్ట్రాల్లోని పాక్ జాతీయులను గుర్తించాలని సీఎంలకు అమిత్ షా ఆదేశం
  • వారిని తక్షణం పాకిస్థాన్‌కు తిప్పి పంపాలని సూచన
పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న పాకిస్థాన్ జాతీయులకు సంబంధించిన వీసాలను రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి, తమ రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులను గుర్తించి, వారిని వెనక్కి పంపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అమిత్ షా ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు పాకిస్థాన్‌కు చెందిన వారిని త్వరగా వెనక్కి పంపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసే ప్రక్రియను చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంమంత్రి సూచించినట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీ నాటికి అన్ని వీసాలు రద్దవుతాయని కేంద్రం తెలిపింది. ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News