శ్రీవారి సేవలో కీలక సంస్కరణలు.. కొత్త రూల్స్ ఇవే!

  • శ్రీవారి సేవ జూన్ నెల ఆన్‌లైన్ కోటా ఏప్రిల్ 30న విడుదల
  • సీనియర్ సేవకులకు 'గ్రూప్ లీడర్' హోదా, కొత్త బాధ్యతలు
  • గ్రూప్ లీడర్ల సేవా కాలపరిమితి ఎంపికకు అవకాశం (15 రోజులు/నెల/3 నెలలు)
  • సేవకుల పర్యవేక్షణ, హాజరు, పనితీరు మూల్యాంకనం గ్రూప్ లీడర్ల విధి
  • పరకామణి సేవకు కనీసం పదో తరగతి అర్హత గల పురుషులకూ అవకాశం
శ్రీవారి భక్తులకు సేవలు అందించే ప్రక్రియను మరింత మెరుగుపరిచే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సీనియర్ సేవకులకు కొత్త హోదా కల్పించడంతో పాటు, పరకామణి సేవలో పాల్గొనేందుకు సాధారణ పురుష సేవకులకూ అవకాశం కల్పించింది. ఈ మార్పులతో పాటు, జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా ఆన్‌లైన్ కోటాను ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

తిరుమల, తిరుపతికి విచ్చేసే లక్షలాది భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు టీటీడీ ఉన్నతాధికారులు ఇటీవల పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థ, కోయంబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్, బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి ప్రముఖ సంస్థలను సందర్శించారు. అక్కడ సేవలందిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన అనంతరం, శ్రీవారి సేవలో పలు సంస్కరణలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి దశ మార్పులను ఏప్రిల్ 30న విడుదల చేయనున్న నూతన అప్లికేషన్ ద్వారా అమలు చేయనున్నారు. భవిష్యత్తులో మరిన్ని మార్పులను దశలవారీగా తీసుకురానున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.

గత రెండేళ్లుగా వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి పదవీ విరమణ పొంది, 45 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వారు 'సీనియర్ సేవకులు'గా సేవలు అందిస్తున్నారు. ఇకపై వీరిని 'గ్రూప్ లీడర్లు'గా వ్యవహరించనున్నారు. వీరు తమకు నచ్చిన విధంగా 15 రోజులు, ఒక నెల లేదా మూడు నెలల పాటు సేవ చేసేందుకు ఆన్‌లైన్‌లో ఆప్షన్ ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. శ్రీవారి సేవకులను క్రమబద్ధీకరించడంలో ఈ గ్రూప్ లీడర్లు కీలక పాత్ర పోషించనున్నారు. తమకు కేటాయించిన విభాగాల్లో సేవకుల పనితీరును పర్యవేక్షించడం, వారి హాజరు నమోదు చేయడం, సేవకుల పనితీరును అత్యుత్తమం, బాగుంది, సాధారణం అని రేటింగ్ ఇవ్వడం వంటి బాధ్యతలను వీరు నిర్వహిస్తారు.

శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ అయిన పరకామణి సేవలో పాల్గొనేందుకు ఇప్పటివరకు ప్రత్యేక కేటగిరీలు ఉండేవి. అయితే, ఇకపై కనీసం పదో తరగతి విద్యార్హత కలిగిన సాధారణ పురుష సేవకులు కూడా ఈ సేవలో పాల్గొనేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. ఆసక్తి గల వారు ఆన్‌లైన్ ద్వారా పరకామణి సేవను బుక్ చేసుకోవచ్చు.

ఏప్రిల్ 30న కోటా విడుదల షెడ్యూల్ ఇలా..
జూన్ నెలకు సంబంధించిన వివిధ సేవల ఆన్‌లైన్ కోటాను ఏప్రిల్ 30న టీటీడీ విడుదల చేయనుంది. విడుదల సమయాలు:
  • ఉదయం 11 గంటలకు: జనరల్ శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి).
  • మధ్యాహ్నం 12 గంటలకు: నవనీత సేవ (మహిళలకు మాత్రమే).
  • మధ్యాహ్నం 1 గంటకు: పరకామణి సేవ (పురుషులకు మాత్రమే).
  • మధ్యాహ్నం 2 గంటలకు: గ్రూప్ లీడర్ సేవ (కొత్తగా).
ఈ నూతన సంస్కరణల ద్వారా శ్రీవారి సేవ మరింత పటిష్టంగా, భక్తులకు మరింత సంతృప్తికరంగా మారుతుందని టీటీడీ ఆశాభావం వ్యక్తం చేసింది.


More Telugu News