భగవద్గీత శ్లోకంతో... ఆసక్తికర ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్

  • స్మితా సబర్వాల్ ను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • 'కర్మణ్యే వాధికారస్తే' అంటూ స్మిత ట్వీట్
  • పర్యాటక శాఖలో అత్యుత్తమ సేవలు అందించానన్న స్మిత
తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్‌కు పర్యాటక శాఖ బాధ్యతలను అప్పగించింది. స్మితా సబర్వాల్‌ను రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ బదిలీ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్ స్పందించారు. భగవద్గీతలోని "కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన" శ్లోకాన్ని ఉటంకిస్తూ ఆమె తన పోస్ట్‌ను ప్రారంభించారు. "పర్యాటక శాఖలో నాలుగు నెలలు పనిచేశాను. నా వంతుగా అత్యుత్తమంగా సేవలు అందించేందుకు ప్రయత్నించాను. రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 2025-30 పర్యాటక విధానాన్ని తీసుకువచ్చాం. ఇది ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయబడిన పర్యాటక ప్రాంతాలకు దిశానిర్దేశం చేయడంతో పాటు, పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన పునాదిగా నిలుస్తుంది" అని ఆమె వివరించారు.

హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల గురించి ఆమె ప్రస్తావిస్తూ... "ఒక గ్లోబల్ ఈవెంట్‌కు అవసరమైన ప్రణాళిక, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు పునాది వేశాను. ఇది అనేక అవకాశాలకు తలుపులు తీస్తుందని నేను విశ్వసిస్తున్నాను. పర్యాటక శాఖలో పనిచేయడం గర్వంగా, గౌరవంగా భావిస్తున్నాను" అని అన్నారు. స్మితా సబర్వాల్ చేసిన ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ, పర్యాటక రంగంలో ఆమె చేసిన కృషిని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, ఇటీవల హైదరాబాద్ శివార్లలోని కంచ గచ్చిబౌలి భూముల కేటాయింపు వ్యవహారంలో స్మితా సబర్వాల్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం నేపథ్యంలోనే ఆమెపై బదిలీ వేటు పడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమెను తక్కువ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక సంఘానికి బదిలీ చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


More Telugu News