ఢిల్లీలో రూ.2 వేల కోట్ల స్కాం.. సిసోడియా, జైన్ లపై మరో కేసు

  • ప్రభుత్వ పాఠశాలలు, క్లాస్ రూంల నిర్మాణంలో అవినీతి ఆరోపణలు
  • ఆమ్ ఆద్మీ పాలనలో 12 వేల స్కూళ్లు, క్లాస్ రూంల నిర్మాణం
  • కాంట్రాక్టర్లలో ఎక్కువ మంది ఆప్ పార్టీ నేతలేనని ఏసీబీ వెల్లడి
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మాజీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ ల మెడకు మరో అవినీతి కేసు చుట్టుకుంది. ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పాఠశాలలు, క్లాస్ రూంల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆరోపించింది. ఆప్ హయాంలో మొత్తంగా 12 వేల స్కూళ్లు, క్లాస్ రూంల నిర్మాణం చేపట్టగా అందులో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది. దీనిపై నాటి ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ లపై కేసు నమోదు చేసింది. 

ఏసీబీ ఆరోపిస్తున్న ప్రకారం.. ఆప్ ప్రభుత్వంలో మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించడంతో పాటు విద్యాశాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. సత్యేందర్ జైన్ పీడబ్ల్యూడీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆప్ హయాంలో మొత్తంగా 12,748 క్లాస్ రూంలు నిర్మించారు. ఈ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం ఉన్న వారేనని ఏసీబీ ఆరోపించింది.

నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయలేదని, దాంతో కాంట్రాక్ట్ వ్యయం ఏకంగా ఐదు రెట్లు పెరిగిందని పేర్కొంది. ఈ నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కూడా నివేదిక ఇచ్చిందని, అయితే, ఆ నివేదికను ఆప్ సర్కారు దాదాపు మూడేళ్ల పాటు తొక్కిపెట్టిందని ఆరోపించింది. క్లాస్ రూం నిర్మాణ వ్యయం దాదాపుగా ఐదు రెట్లు పెరగడంపై బీజేపీ నేతల ఫిర్యాదుతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం.

ఢిల్లీ ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహించిన వీరిద్దరూ గత కొంతకాలంగా పలు ఆరోపణలపై చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో సిసోడియా, మనీ లాండరింగ్ ఆరోపణలపై సత్యేందర్ జైన్ లు జైలుకు వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు బెయిల్ పై బయట ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారిపై తాజా ఆరోపణలు, కేసు నమోదు కావడం ఆప్ వర్గాల్లో కలకలం రేపుతోంది.


More Telugu News