'వేవ్స్' వేదికగా చిరంజీవి గురించి మాట్లాడిన అల్లు అర్జున్

  • ముంబైలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 'వేవ్స్' సదస్సు ప్రారంభం
  • చిరంజీవి తనకు బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్.. తనను ప్రభావితం చేశారన్న స్టైలిష్ స్టార్
  • మానసిక ప్రశాంతతే తన ఫిట్‌నెస్‌కు కారణమని వెల్లడించిన అల్లు అర్జున్
  • సినిమానే తన ప్రపంచమని, అభిమానుల వల్లే ఈ స్థాయికి వచ్చానన్న బన్నీ
ముంబైలో 'వేవ్స్' (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్) సదస్సు సినీ, వినోద రంగ ప్రముఖుల రాకతో అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పలువురు సినీ దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ఫిట్‌నెస్ రహస్యాన్ని, సినీ ప్రయాణాన్ని పంచుకున్నారు. చిరంజీవి తనను ఎంతగానో ప్రభావితం చేశారని వెల్లడించారు.

'వేవ్స్' సదస్సులో అల్లు అర్జున్ మాట్లాడుతూ, తన శారీరక దృఢత్వానికి మానసిక ప్రశాంతతే ప్రధాన కారణమని తెలిపారు. గతంలో సిక్స్ ప్యాక్ కోసం ఎంతో కష్టపడ్డానని గుర్తు చేసుకున్నారు. చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఇష్టమని, తన సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని చెప్పారు.

"సినిమానే నా ప్రపంచం. నాకు మరో ఆలోచన లేదు. ప్రేక్షకులు, అభిమానులు చూపించిన ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది" అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తనకు తన కుటుంబం నుంచి అన్ని విధాలుగా మద్దతు ఉందని తెలిపారు. తన తాత అల్లు రామలింగయ్య సుమారు వెయ్యి చిత్రాల్లో నటించారని, తన తండ్రి అరవింద్ 70 సినిమాల వరకు నిర్మించారని, తన మామయ్య చిరంజీవి తనకు బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ అని, ఆయన తనను ఎంతగానో ప్రభావితం చేశారని పేర్కొన్నారు.

తన 18వ సినిమా బాగా ఆడకపోవడంతో ఇబ్బందిపడ్డానని అల్లు అర్జున్ వెల్లడించారు. ఆ సమయంలో ఆత్మవిమర్శ చేసుకున్నానని తెలిపారు. ఆ సమయంలో తన గురించి చాలామంది చాలా మాట్లాడారని పేర్కొన్నారు. సొంతంగా తాను మంచి డ్యాన్సర్‌ను అని, ఆ తర్వాత ట్రైనర్ సహాయంతో మరింత రాటుదేలినట్లు చెప్పారు.


More Telugu News