మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఆపే దమ్ము ఎవరికీ లేదు: మంత్రి నారా లోకేశ్

  • అమరావతి పనుల పునఃప్రారంభ సభలో మంత్రి నారా లోకేష్ ప్రసంగం
  • గత ప్రభుత్వ వైఖరిపై విమర్శలు, అమరావతి రైతుల త్యాగాలకు వందనం
  • ప్రధాని మోదీ సహకారంతో అమరావతి అభివృద్ధి ఆగదని ధీమా
  • పాక్ ఉగ్రదాడిపై తీవ్ర వ్యాఖ్యలు, కేంద్ర కులగణన నిర్ణయంపై హర్షం
  • రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయమని వెల్లడి
ఏపీ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. ఈ సందర్భంగా వెలగపూడిలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి  నారా లోకేశ్ ప్రసంగించారు. 

చంద్రబాబుపై కక్షతో...!

గత ప్రభుత్వం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు కాలయాపన చేశారే తప్ప, రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆరోపించారు. అమరావతి కోసం 1,631 రోజుల పాటు అలుపెరగని పోరాటం చేసిన రైతుల త్యాగాలను ఆయన గుర్తుచేసుకున్నారు. 

"నాడు 8 ఏళ్ల పిల్లాడి దగ్గర నుండి 80 ఏళ్ళ వృద్ధుల వరకూ జై అమరావతి అంటూ జెండా పట్టారు. జై అమరావతి అన్నందుకు అనాడు రైతులకు సంకెళ్లు వేసారు, అమరావతి ఉద్యమంలో పాల్గొన్నందుకు మహిళా రైతుల్ని పోలీసుల బూటు కాలితో తన్నించారు. అమరావతి ఉద్యమంలో 270 మంది రైతులు చనిపోయారు. 3 వేల మంది పై అక్రమ కేసులు పెట్టారు. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి నినాదాన్ని మాత్రం ఆపలేకపోయారు" అని వివరించారు.

ఉద్యమంలో పాల్గొన్న రైతులపై అక్రమ కేసులు బనాయించారని, మహిళలపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో పోరాడిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. "ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెరటి మొక్క కాదు, ఇది జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని" అని లోకేశ్ వ్యాఖ్యానించారు. 

ఇప్పుడు ఆపండి చూద్దాం...!

ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అమరావతి అభివృద్ధి పనులు తిరిగి ఊపందుకున్నాయని, ఇక రాజధాని నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని ('అన్ స్టాపబుల్' అని) లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఆపే దమ్ము ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడతాయని అన్నారు. 




More Telugu News