ఇటీవల కలిసినప్పుడు మోదీ చాలా సీరియస్ గా కనిపించారు: చంద్రబాబు

  • నేటి రోజు ఏపీ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుందన్న సీఎం చంద్రబాబు.
  • గతంలో అమరావతి పనులకు మోదీనే శంకుస్థాపన చేశారని వెల్లడి
  • మళ్లీ ఆయన చేతుల మీదుగానే పునఃప్రారంభం అవుతున్నాయని వివరణ
  • మోదీ కులగణన నిర్ణయం భేష్ అంటూ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రోజు శాశ్వతంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ సభలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పనులకు శంకుస్థాపన జరిగిందని, దురదృష్టవశాత్తు గత ఐదేళ్లుగా ఈ పనులు నిలిచిపోయాయని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ ప్రధాని మోదీ చేతుల మీదుగానే (పరోక్షంగా ఆయన ప్రభుత్వ హయాంలో) పనులు పునఃప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

గతంలో తాను ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన ఎంతో ఆహ్లాదంగా ఉండేవారని, కానీ ఇటీవల కలిసినప్పుడు మాత్రం చాలా గంభీరంగా కనిపించారని ముఖ్యమంత్రి తెలిపారు. పహల్గామ్‌లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధ ఆయనలో స్పష్టంగా కనిపించిందని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. "మోదీ జీ, మేమంతా మీ వెంటే ఉన్నాం. వందేమాతరం, భారత్ మాతాకీ జై" అంటూ తాము ప్రధాని వెంటే నిలుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ప్రకటించారు.

సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారని చంద్రబాబు ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారని కొనియాడారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేనాటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో పదో స్థానంలో ఉందని, ఇప్పుడు ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గుర్తుచేశారు. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒకవైపు అభివృద్ధి, మరోవైపు పేదరిక నిర్మూలనకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. దేశాభివృద్ధే లక్ష్యంగా ఆయన శ్రమిస్తున్నారని అన్నారు. ఇటీవల కులగణన చేయాలని మోదీ నిర్ణయం తీసుకున్నారని, ఇది కేంద్రం తీసుకున్న గొప్ప నిర్ణయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతి పునఃప్రారంభంతో రాష్ట్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News