మూడేళ్ల చిన్నారికి ఆమరణ ఉపవాస దీక్ష.. ఇండోర్ లో దారుణం

  • కఠిన ఉపవాసంతో మరణాన్ని ఆహ్వానించడమే జైన మతంలోని ‘సల్లేఖన దీక్ష’
  • కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న చిన్నారి
  • మత గురువు సూచనలు, తల్లిదండ్రుల అనుమతితో చిన్నారికి దీక్ష
  • మైనర్ బాలికకు 'సల్లేఖన దీక్ష' ఇవ్వడంపై నిపుణుల ఆందోళన 
మాటలు కూడా పూర్తిగా రాని మూడేళ్ల చిన్నారికి సల్లేఖన దీక్ష ఇవ్వడం మధ్యప్రదేశ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జైన మత విశ్వాసాల ప్రకారం.. ఆహారం, నీరు తీసుకోకుండా శరీరాన్ని కృశింపజేసుకుంటూ మరణాన్ని ఆహ్వానించడమే సల్లేఖనం లేదా సంతారా. సాధారణంగా వృద్ధాప్యం పైబడిన వారు ఈ దీక్ష ద్వారా మరణాన్ని స్వచ్ఛందంగా ఆహ్వానిస్తారు. అయితే, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ మూడేళ్ల పాప వియానా జైన్ తో ఆమె తల్లిదండ్రులు ఈ దీక్ష నిర్వహించారు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వియానా సల్లేఖన దీక్ష ప్రారంభించిన పది నిమిషాల్లోనే తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన ఇప్పుడు అనేక నైతిక, చట్టపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ఐటీ నిపుణులైన పీయూష్, వర్షా జైన్‌ దంపతుల ఏకైక కుమార్తె వియానా. గత డిసెంబర్‌లో చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ముంబైలో శస్త్రచికిత్స సహా చికిత్స అందించినప్పటికీ పాప కోలుకోలేదు. రోజురోజుకూ పాప పరిస్థితి విషమించడంతో జైన మత విశ్వాసులైన ఆ కుటుంబం ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించింది. మార్చి 21న ఇండోర్‌లోని జైన ఆధ్యాత్మిక గురువు రాజేష్ ముని మహరాజ్‌ను కలిసినప్పుడు, ఆయన సూచన మేరకు చిన్నారికి 'సల్లేఖన' నిర్వహించారు. "మా అంగీకారంతోనే 'సల్లేఖన' జరిగింది, పది నిమిషాల్లోనే వియానా మరణించింది" అని ఆమె తల్లి వర్షా జైన్ తెలిపారు.

'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌'లో అతి పిన్న వయసులో 'సల్లేఖన దీక్ష’ స్వీకరించిన వ్యక్తిగా వియానా పేరు నమోదవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, మరణం అంటే ఏమిటో అర్థం చేసుకోలేని వయసులో ఉన్న చిన్నారి తరఫున ఈ నిర్ణయం ఎవరు తీసుకునే హక్కు కలిగి ఉన్నారనే ప్రశ్న తలెత్తుతోంది. "మైనర్ల జీవితం, మరణంపై నిర్ణయం తీసుకునే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదు. మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ, అది చట్టానికి అతీతం కాదు. మైనర్ల జీవించే హక్కును మతపరమైన ఆచారాలు కూడా అధిగమించలేవు" అని సుప్రీంకోర్టు న్యాయవాది రితేష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. గతంలో 'సల్లేఖన' చట్టబద్ధతపై భిన్నమైన కోర్టు తీర్పులున్నప్పటికీ, మైనర్ల విషయంలో స్పష్టత లేదు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఇండోర్ పోలీసులు పేర్కొన్నారు. "వియానా 'సల్లేఖన దీక్ష' గురించి మా వద్ద ఎటువంటి రికార్డు లేదు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు గానీ, పరిపాలనా విభాగానికి గానీ ఎవరూ సమాచారం ఇవ్వలేదు" అని అదనపు డీసీపీ రాజేష్ దండోటియా ధ్రువీకరించారు.


More Telugu News