జగన్, చంద్రబాబు పాలనల మధ్య తేడా ఇదే: మంత్రి పార్థసారథి

  • గత ప్రభుత్వ దుర్మార్గ పాలన నుంచి ప్రజలు బయటపడ్డారు: పార్థసారథి
  • రూ.10 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని వైసీపీ ఊబిలోకి నెట్టింది
  • చంద్రబాబు అనుభవం, కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం
  • జగన్ పాలనలో వ్యవస్థల విధ్వంసం, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు
  • చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయి, కక్ష సాధింపు కాదని స్పష్టీకరణ
గత ఐదేళ్ల వైసీపీ పాలనకూ, ప్రస్తుత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనకూ మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఓ  ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని, వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఆరోపించారు. చంద్రబాబు అనుభవం, దూరదృష్టితో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని ఆయన వివరించారు.

గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దాదాపు రూ.10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. "గత ప్రభుత్వం చెప్పిన మాటలకు, చేతలకు పొంతన లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వారి మాటల్లో నిజం అంతే ఉంది. కేవలం సంక్షేమ పథకాలతోనే ప్రభుత్వం నడవదు. భవిష్యత్తును పూర్తిగా విస్మరించి, ఆదాయ మార్గాలను గాలికొదిలేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు" అని ఆయన విమర్శించారు. రైతులు, విద్యార్థులు, కాంట్రాక్టర్లు ఇలా అన్ని వర్గాలను మోసం చేశారని, అభివృద్ధి పూర్తిగా శూన్యమని అన్నారు. 

ఇంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా చంద్రబాబు తన అనుభవం, పరపతి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గ్రహించారని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ, దానికి కారణం గత ప్రభుత్వ ఆర్థిక అరాచకమేనని ఆయన స్పష్టం చేశారు.

జగన్మోహన్ రెడ్డి కేవలం తన రాజకీయ లబ్ధి గురించే ఆలోచించారు తప్ప, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఏమాత్రం పట్టించుకోలేదని పార్థసారథి దుయ్యబట్టారు. "ఆదాయం గురించి ఆలోచించకుండా అప్పులు చేసుకుంటూ పోతే కుటుంబమైనా, రాష్ట్రమైనా దివాళా తీస్తుంది. జగన్ పాలనలో అదే జరిగింది. ప్రజాస్వామ్య విలువలను, వ్యవస్థలను గౌరవించని తీరు నచ్చకే నేను వైసీపీ నుంచి బయటకు వచ్చాను" అని ఆయన వివరించారు. రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని, అనుభవజ్ఞుడైన చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టగలరనే నమ్మకంతోనే తాను టీడీపీలో చేరానని తెలిపారు.

టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న వైసీపీ ఆరోపణలను మంత్రి ఖండించారు. "రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీకి మాట్లాడే అర్హత లేదు. మేము చట్టానికి లోబడే పనిచేస్తున్నాం. లోకేశ్ చెప్పినట్లుగా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై ఆధారాలతో సహా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో కక్ష సాధింపు ఎక్కడుంది? చట్ట వ్యతిరేక పనులు చేసిన వారిని వదిలేస్తే భవిష్యత్ తరాలకు ఏం సమాధానం చెబుతాం?" అని ఆయన ప్రశ్నించారు. 

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అరెస్టును ప్రస్తావిస్తూ, అధికారులు చట్టానికి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలే తప్ప, ఎవరినో సంతృప్తి పరచడానికి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవనే స్పష్టమైన సందేశం పంపామని అన్నారు.




More Telugu News