భూమి పూజ వేళ ఎల్జీ ప్రతినిధుల సంస్కారం... లోకేశ్ విజ్ఞప్తితో షూ తీసేసిన కొరియన్లు

  • శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు భూమి పూజ
  • మంత్రి లోకేశ్ విజ్ఞప్తితో పాదరక్షలు తీసిన ఎల్జీ ప్రతినిధులు
  • భారతీయ సంప్రదాయాలకు కొరియన్ల గౌరవం
ఇవాళ శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఏపీ ఎలక్ట్రానిక్స్, ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్, ఎల్జీ ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమం భారతీయ సంప్రదాయాల ప్రకారం జరిగింది.

ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. భూమి పూజ స్థలికి విచ్చేసిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కొరియన్ ప్రతినిధులు పాదరక్షలతోనే కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిని గమనించిన మంత్రి నారా లోకేశ్, భారతీయ పూజా కార్యక్రమాలలో పాదరక్షలు ధరించరాదనే సంప్రదాయాన్ని వారికి సున్నితంగా వివరించారు. పూజలో పాల్గొనేటప్పుడు పాదరక్షలు తీసివేయాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి లోకేశ్ సూచనను ఎల్జీ ప్రతినిధులు తక్షణమే గౌరవించారు. వారంతా తమ పాదరక్షలను విడిచిపెట్టి, నేలపై కూర్చుని శ్రద్ధాసక్తులతో భూమి పూజలో పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి, ఇతర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. విదేశీయులు భారతీయ సంప్రదాయాలను అర్థం చేసుకుని, వాటిని పాటించడం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. మంత్రి లోకేశ్ చొరవ, కొరియన్ ప్రతినిధుల సంస్కారయుత ప్రవర్తన ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను చేకూర్చాయి. 

కాగా, సుమారు రూ.5000 కోట్ల భారీ పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్, శ్రీ సిటీలో తమ ఉత్పాదక కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 2000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమయ్యాక, దేశీయ మార్కెట్‌లోని 70 శాతం ఎయిర్ కండిషనర్ల (ఏసీ) అవసరాలను ఇక్కడి నుంచే తీర్చాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.


More Telugu News