పాక్‌తో యుద్ధంపై ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి ట్వీట్‌.. నెట్టింట విమ‌ర్శ‌లు

  
భార‌త్‌-పాక్ స‌రిహద్దులో యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న వేళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, న‌టి విజ‌య‌శాంతి చేసిన సోష‌ల్ మీడియా పోస్టుపై నెట్టింట విమ‌ర్శ‌లొస్తున్నాయి. భారత్‌పైకి ఉగ్రవాదులని ఉసిగొలుపుతున్న పాకిస్థాన్‌ను కట్టడి చెయ్యడంలో మొదటి నుంచీ ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేననడంలో ఏమీ సందేహం లేదు అని విజ‌య‌శాంతి ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్‌పై కొంద‌రు మండిప‌డుతున్నారు.  

"భారత్‌పైకి ఉగ్రవాదులని ఉసిగొలుపుతున్న పాకిస్థాన్‌ను కట్టడి చెయ్యడంలో మొదటి నుంచీ ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేననడంలో ఏమీ సందేహం లేదు. 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకూ మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ తర్వాత 1971లో తూర్పు పాకిస్థాన్‌ని విడగొట్టి నేటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారే.

వీరిని స్ఫూర్తిగా తీసుకుని తర్వాతి భారత ప్రభుత్వాలు నేటికీ భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తూనే ఉండి తీరుతాయి అన్నది ఎప్పటికీ సత్యం. అయితే, కొంతమంది సోషల్ మీడియాల రాజకీయ ప్రయోజనం కోసం ఈ సమస్యను ప్రస్తావిస్తున్నప్పటికీ, ప్రజలెవ్వరమూ రాజకీయం అనే కోణంలో ఈ అంశాన్ని చూడటం లేదు అని ఆ కొందరు కూడా అర్థం చేసుకోగలగాలని అభిప్రాయపడుతున్నాను" అని ఆమె ట్వీట్ చేశారు. దీంతో దేశ భ‌ద్ర‌త‌, ఐక్య‌త విష‌యంలో రాజ‌కీయాలు ఏంట‌ని? విజ‌యశాంతిపై కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 


More Telugu News