ప్రధాని మోదీ ప్రసంగించిన కొద్ది నిమిషాలకే.. సాంబా జిల్లాలో డ్రోన్ల కలకలం

  • జమ్ములోని సాంబా సెక్టార్‌లో అనుమానాస్పద డ్రోన్లు గుర్తింపు
  • డ్రోన్లను కూల్చివేసిన క్షిపణి రక్షణ వ్యవస్థ
  • ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటికే ఈ పరిణామం
  • డ్రోన్ల కదలికలపై సామాజిక మాధ్యమంలో వీడియోలు వైరల్
జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ల కదలికలు మరోసారి కలకలం రేపాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే జమ్ములోని సాంబా ప్రాంతంలో అనుమానాస్పద డ్రోన్లు కదలాడాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు మన క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా ఆ డ్రోన్‌లను కూల్చివేశాయి. ప్రస్తుతం సాంబా సెక్టారులో బ్లాకౌట్ అమలవుతోంది.

సోమవారం రాత్రి ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన కొద్దిసేపటికే సాంబా సెక్టార్‌లోని సరిహద్దు ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ డ్రోన్లు కనిపించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సరిహద్దు భద్రతా దళాలు ఈ డ్రోన్ల కదలికలను గుర్తించాయి. ఈ డ్రోన్ల చొరబాటును ధృవీకరించే వీడియో ఫుటేజ్ కూడా లభ్యమైంది. ఈ ఘటనతో సరిహద్దు వెంబడి నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.

గత కొన్నిరోజులుగా పలుమార్లు ఈ ప్రాంతంలో పాకిస్థాన్ వైపు నుంచి డ్రోన్లు ప్రవేశించిన ఘటనలు నమోదయ్యాయి. ఆయుధాలు, మాదకద్రవ్యాలను జారవిడిచేందుకు, భారత సైనిక స్థావరాలపై నిఘా పెట్టేందుకు పాకిస్థాన్ డ్రోన్లను ఉపయోగిస్తోందని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. సాంబా సెక్టార్‌లో డ్రోన్లను గుర్తించిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.


More Telugu News