మోదీ ప్రసంగం పార్లమెంటు చర్చకు ప్రత్యామ్నాయం కాదు.. సీపీఎం నేత ఎం.ఏ. బేబీ

  • సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ విమర్శ
  • టీవీ ప్రసంగం పార్లమెంటులో జరిగే నిర్మాణాత్మక చర్చకు ప్రత్యామ్నాయం కాదని వ్యాఖ్య
  • ప్రజాస్వామ్యం ఏకపక్షంగా సాగదని, ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలన్న బేబీ
  • కాల్పుల్లో మరణించిన వారిని, కశ్మీరీల సహాయాన్ని ప్రధాని ప్రస్తావించలేదని విమర్శ
  • విదేశాంగ కార్యదర్శిపై జరిగిన ద్వేష ప్రచారాన్ని ఖండించలేదని ఆరోపణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం, పార్లమెంటులో నిర్మాణాత్మకంగా జరగాల్సిన చర్చకు ప్రత్యామ్నాయం కాదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ అన్నారు. సోమవారం రాత్రి ప్రధాని ప్రసంగం అనంతరం ఆయన ఈ మేరకు స్పందించారు. ప్రజాస్వామ్యం అంటే ఏకపక్షంగా సాగే వ్యవహారం కాదని, టెలివిజన్‌లో ప్రసంగాలు ఇవ్వడం ద్వారా పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలను పక్కన పెట్టలేరని ఆయన ఫేస్‌బుక్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉంటుందని బేబీ గుర్తుచేశారు. కాల్పుల విరమణ పరిణామాలు, ఇతర జాతీయ ఆందోళనలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ తాను ప్రధానికి లేఖ రాసినట్లు బేబీ వెల్లడించారు.

ప్రధాని తన ప్రసంగంలో కొన్ని ముఖ్యమైన అంశాలను విస్మరించారని బేబీ ఆరోపించారు. సరిహద్దు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి, వారి కుటుంబాల గురించి ప్రధాని కనీసం ప్రస్తావించలేదని విమర్శించారు. గత నెలలో పహల్గామ్‌లో ఉగ్రదాడి బాధితులకు సహాయం చేయడంలో కశ్మీర్ ప్రజలు చూపిన చొరవ, వారి పాత్ర గురించి కూడా ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. కశ్మీరీల ధైర్యాన్ని, ఉగ్రదాడిని వారు ముక్తకంఠంతో ఖండించడాన్ని ప్రధాని విస్మరించారని పేర్కొన్నారు.

ప్రభుత్వ వాణిని వినిపించిన విదేశాంగ కార్యదర్శిపై జరిగిన ద్వేషపూరిత ప్రచారాన్ని ఖండించడంలో కూడా ప్రధాని విఫలమయ్యారని ఎం.ఏ. బేబీ ఆరోపించారు.


More Telugu News