విజ‌య్ దేవ‌ర‌కొండ‌ 'కింగ్‌డ‌మ్' విడుద‌ల వాయిదా.. థియేట‌ర్ల‌లో వ‌చ్చేది ఎప్పుడంటే..!

  • విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో 'కింగ్‌డమ్‌'
  • మే 30న విడుద‌ల కావాల్సిన చిత్రం జులై 4వ తేదీకి వాయిదా
  • ఇటీవ‌ల‌ దేశంలో నెలకొన్న ఉద్రిక్త‌త ప‌రిస్థితుల కార‌ణంగానే మూవీ రిలీజ్ వాయిదా
  • ఈ మేర‌కు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్ర‌క‌ట‌న
రౌడీబాయ్‌ విజయ్ దేవరకొండ హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కింగ్‌డమ్‌'. తాజాగా ఈ మూవీ విడుద‌ల తేదీపై మేక‌ర్స్ కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. మే 30వ తారీఖున విడుదల కావాల్సిన ఈ సినిమా జులైకు వాయిదా ప‌డింది. ఈమేర‌కు ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  

జులై 4న 'కింగ్‌డమ్' రిలీజ్
మే 30వ తేదీ నుంచి జులై 4కు 'కింగ్‌డమ్‌'ను వాయిదా వేసిన విషయాన్ని ఈ రోజు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ''మా 'కింగ్‌డమ్‌'ను మే 30వ తేదీకే తీసుకు రావాలని ఎంతో ప్ర‌య‌త్నించాం. కానీ, ఇటీవల దేశంలో ఊహించని ఘటనలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రచారం చేయడం, ఈవెంట్స్ నిర్వహించడం సరికాదని వాయిదా వేశాం. జులై 4న చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేర్కొంది. 

థియేటర్లలోకి 'కింగ్‌డమ్' ఆలస్యంగా వచ్చినా అభిమానులతో పాటు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని తెలిపింది. ఇక‌, ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ స్పెష‌ల్ వీడియోకు మంచి స్పంద‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దాంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. విజ‌య్ స‌ర‌స‌న హీరోయిన్‌గా భాగ్య‌శ్రీ బోర్సే న‌టిస్తుండ‌గా.. యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ బాణీలు అందిస్తున్నారు.


More Telugu News