నేడు ఐపీఎల్ రీస్టార్ట్.. ఫ్రాంచైజీలు రీప్లేస్ చేసిన‌ ఆట‌గాళ్ల జాబితా ఇదే!

  • పాక్‌, భార‌త్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వారం పాటు వాయిదా ప‌డ్డ ఐపీఎల్‌
  • ఇవాళ బెంగ‌ళూరులో జ‌రిగే కేకేఆర్‌, ఆర్‌సీబీ మ్యాచ్‌తో రీస్టార్ట్‌
  • లీగ్‌ వాయిదా ప‌డ‌డంతో స్వ‌దేశాల‌కు వెళ్లిపోయిన‌ కొంత‌మంది విదేశీ ఆట‌గాళ్లు
  • అలాగే గాయం కార‌ణంగా ఫ్రాంచైజీల‌కు దూర‌మైన మ‌రికొంత‌మంది ప్లేయ‌ర్లు
  • వారి స్థానంలో కొత్త ప్లేయ‌ర్లను తీసుకున్న ఐపీఎల్ జ‌ట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 పాక్‌, భార‌త్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు వాయిదా ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే, ఈరోజు నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. మిగిలిన లీగ్ మ్యాచ్‌ల‌ను ఆరు న‌గ‌రాల్లో నిర్వ‌హించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 27 వ‌ర‌కు లీగ్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. 

అనంత‌రం 29 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు మొద‌లు కానున్నాయి. ఇక‌, జూన్ 3న ఫైనల్ జరగనుంది. ఈరోజు బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) మ‌ధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ రీస్టార్ట్ కానుంది.  

అయితే, లీగ్‌ వారం పాటు వాయిదా ప‌డ‌డంతో కొంత‌మంది విదేశీ ఆట‌గాళ్లు వారి దేశాల‌కు వెళ్లిపోయారు. వారిలో కొంద‌రు తిరిగి భార‌త్‌కు వ‌చ్చేందుకు సుముఖ‌త చూపించ‌లేదు. అలాగే కొంత‌మంది ప్లేయ‌ర్లు గాయాల కార‌ణంగా జ‌ట్ల‌కు దూర‌మ‌య్యారు. దాంతో వారి స్థానాల్లో ఫ్రాంచైజీలు కొత్త ఆట‌గాళ్ల‌ను తీసుకున్నాయి. ఫ్రాంచైజీలలో తాజా మార్పుల సమగ్ర జాబితాపై ఇప్పుడు మ‌నం ఓ లుక్కేద్దాం. 

పంజాబ్ కింగ్స్ (PBKS): తొడ కండరాల గాయంతో జట్టుకు దూర‌మైన‌ లాకీ ఫెర్గూసన్ స్థానంలో కైల్ జామిసన్‌ను జట్టులోకి తీసుకుంది పీబీకేఎస్‌. అలాగే వేలికి గాయం అయిన ఆల్‌రౌండ‌ర్‌ గ్లెన్ మాక్స్‌వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్ జట్టులోకి వచ్చాడు.

గుజరాత్ టైటాన్స్ (GT): వెస్టిండీస్‌తో ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం స్వ‌దేశానికి వెళ్తున్న‌ జోస్ బట్లర్ స్థానంలో కుశాల్ మెండిస్ జట్టులోకి వచ్చాడు.

లక్నో సూపర్ జెయింట్స్ (LSG): వెన్నునొప్పితో జట్టుకు దూరమైన స్టార్ పేస‌ర్‌ మయాంక్ యాదవ్ స్థానంలో విలియం ఓరూర్కే జట్టులోకి చేరాడు.

ముంబ‌యి ఇండియన్స్ (MI): వెస్టిండీస్‌తో సిరీస్ కోసం స్వ‌దేశానికి వెళ్లిన ఇంగ్లాండ్ ఆట‌గాడు విల్ జాక్స్ స్థానంలో జానీ బెయిర్‌స్టోను ఎంఐ రీప్లేస్ చేసింది. అలాగే జాతీయ జ‌ట్టుకు ఆడేందుకు వెళ్లిపోయిన ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు ర్యాన్ రికెల్టన్ స్థానంలో రిచర్డ్ గ్లీసన్ వచ్చాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ (DC): వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ స్థానంలో బంగ్లాదేశ్‌కు చెందిన స్టార్ బౌల‌ర్‌ ముస్తాఫిజుర్ రెహమాన్ ను డీసీ తీసుకుంది.


More Telugu News